నేవీ డే అంకురార్పణకు కారణమైన ఘాజీ..... అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది. నిజంగా విశాఖ  వినాశనమే దాని లక్ష్యమా? లేదంటే మరో టార్గెట్‌కు గురిపెట్టిందా? అదే నిజమైతే... మరి అదేంటి? ఛేదించకుండానే ఎలా చతికిలపడింది? దానికదే మునిగిపోయిందా? మన నావికాదళమే నాశనం చేసిందా? 


భారత్‌, పాకిస్తాన్‌ మధ్య పలుమార్లు యుద్ధాలు జరిగాయి. వాటిలో కొన్నింటిని మనం చూశాం.. మరికొన్నిటి గురించి విన్నాం. వాటన్నిటిలో అయితే ఆర్మీ.. కాదంటే ఎయిర్‌ఫోర్స్‌ పాత్రనే చూశాం. కానీ.. మనం చూడని.. కనీసం సరిగ్గా వినని మరో యుద్ధం కూడా దాయాది దేశాల మధ్య జరిగింది. అదే నేవీ పాల్గొన్న యుద్ధం. అవును.. ఎవరికీ కనిపించకుండా సాగర గర్భంలో...  వందలాది మీటర్ల లోతున జరిగిన ఈ యుద్ధం ఎవరికీ ఎక్కువగా తెలియదు. అదీ విశాఖపట్నానికి అత్యంత సమీపాన జరిగిందని అసలే తెలియదు.


1971 డిసెంబర్‌ 3 అర్ధరాత్రి అంటే దాదాపు 47ఏళ్ల క్రితం ఈ సాగర సమరం జరిగింది. తూర్పు సాగర తీరంలోకి పాకిస్తాన్‌ నుంచి వచ్చిన సబ్‌మెరైన్‌ ఘాజీని మన నావికాదళం తుక్కుతుక్కు చేసింది. అనూహ్య దాడితో సముద్రపు అట్టడగులకు చేర్చింది. నిజానికి ఘాజీ టార్గెట్‌ స్టీల్‌సిటీ విశాఖ కాదు... దాని అసలైన లక్ష్యం మన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌. యస్‌.. విమానాలను సైతం మోసుకెళ్లే ఈ షిప్‌ను ధ్వంసం చేయాలని పాకిస్తాన్‌ పన్నిన కుట్రలో భాగంగా ఇక్కడ పాదం మోపింది. 1971, నవంబర్‌ 14న 10మంది నేవీ అధికారులు, మరో 82మంది సైనిక సిబ్బందితో కరాచీ పోర్టు నుంచి కదనరంగంలో దూకిన ఘాజీ... సరిగ్గా 20రోజుల్లో కనిపించకుండా పోయింది. 


4వేల 828 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఒక్కదానినే కాదు.. మన తూర్పు నావికాదళాన్ని మొత్తం తుద ముట్టించాలన్న లక్ష్యంతో  నీట్లో దూకిన ఈ జలాంతర్గామి... సముద్రం లోతుల్లో నుంచే ప్రయాణాన్ని ప్రారంభించింది. కరాచీ నుంచి బయల్దేరిన రెండ్రోజుల్లోనే అరేబియా సముద్రంలోని బాంబే తీరానికి చేరుకుంది. అక్కడి నుంచి శ్రీలంక మీదుగా మరో మూడ్రోజులకు అంటే నవంబర్‌ 19న బంగాళాఖాతంలోకి ఎంటర్‌ అయింది. ఆ తర్వాత చెన్నై సమీపానికి చేరింది. వెంటనే విక్రాంత్‌ కోసం వేట మొదలెట్టింది. కానీ.. ప్లాన్‌ కంటే పదిరోజులు ఆలస్యంగా చేరడంతో అనుకున్న పని చేయలేకపోయింది. ఎందుకంటే.. అప్పటికే విక్రాంత్‌ నౌక అక్కడి నుంచి అండమాన్‌ సమీపానికి చేరిపోయింది.


అయితే... అప్పటికే ఘాజీ ఎంట్రీని గుర్తించేసిన మన నేవీ... దానిని ఢీకొట్టేందుకు ప్లాన్లు వేసింది. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకుని డీలా పడింది. ఎందుకంటే.. ఘాజీ అమెరికా జలాంతర్గామి. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. అగ్రరాజ్య అస్త్రంగా కొంతకాలం పనిచేసిన ఈ సబ్‌మెరైన్‌.. 1964లో పాక్‌ చెంతకు చేరింది. దీనిని లీజుకు తీసుకున్న పాకిస్తాన్‌.. భారత్‌ వైపు గురిపెట్టింది. 1965లో జరిగిన యుద్ధంలో మన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాక్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. దానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలనుకుంది. ఆ యుద్ధం ముగిసిన ఆరేళ్లకే అది ఆశపడుతున్న సమయం వచ్చింది. 1971లో పాకిస్తాన్‌ దేశం... తూర్పు, ప‌శ్చిమ అని రెండుగా విడిపోయి కొట్టుకోవ‌డం మొద‌లు పెట్టింది. ఆనాడు తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడింది. ఆ పోరాటానికి భారత సహకారం అందించడాన్ని జీర్ణించుకోలేకపోయిన సౌత్‌ పాకిస్తాన్‌.. భారత్‌ను దెబ్బ తీయాలనుకుంది. 


నేలపై యుద్ధం చేస్తే ఎలాగూ గెలవలేమని 1965 యుద్ధంతోనే తేలిపోయింది. అందుకే ఇలా నీళ్ల లోపలినుంచి దొంగదెబ్బ కొట్టాలనుకుంది. అందుకోసం ముందు విమానాలను మోసుకెళ్లే విక్రాంత్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది. విక్రాంత్‌ను  నాశనం చేస్తే.. ఆ తర్వాత భూమిపై యుద్ధంలోనూ గెలవవచ్చని ఆశ పడింది. మరోవైపు బంగ్లాదేశ్‌ను కూడా ఈ సబ్‌మెరైన్‌తోనే వణికించాలనుకుంది. అయితే అక్కడికి వెళ్లేందుకు అడ్డంకిగా ఉన్న భారత్‌ పనిపడితే బంగ్లా చేరుకోవడం ఈజీ అని భావించింది. అందుకే ఈ కుట్రకోణానికి తెరలేపింది.


ఈ కుట్ర, ఘాజీ స్టామినా తెలుసుకున్న నేవీ ఏంచేయాలో తెలియక తల పట్టుకుంది. ఎందుకంటే మనం కూడా రష్యా సహకారంతో సబ్‌మెరైన్లను సమకూర్చుకున్నా.. ఘాజీని ఢీకొట్టే సామర్థ్యం వాటికి లేదు. అందుకే అప్పటి మన నేవీ అధికారులు మైండ్‌ గేమ్‌ స్టార్ట్‌ చేశారు. పాక్‌ను పక్కదారి పట్టించే ప్లాన్‌ వేశారు. విక్రాంత్‌ నౌక విశాఖ తీరప్రాంతంలో ఉందని.. దానిని చెన్నై పోర్టుకు పంపిస్తున్నామని ఫోన్లలో మాట్లాడుకున్నారు. దీనిని తెలుసుకున్న పాక్‌ నేవీ అధికారులు వెంటనే ఘాజీని చెన్నై తీరం నుంచి విశాఖ తీరం వైపు మళ్లించారు.


దీంతో.. ప్లాన్‌ వర్కవుట్‌ అయిందనుకున్న మన నేవీ ఆఫీసర్లు.. ఘాజీ వచ్చేలోపు విక్రాంత్‌ తరహాలో ఉండే ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుథ్‌ను రంగంలోకి దింపారు. విశాఖ తీర ప్రాంతంలో ఈ నౌకను రెడీగా ఉంచారు. ఆ తర్వాత ఘాజీ సబ్‌మెరైన్‌ విశాఖకు 20 నాటికన్‌ మైళ్ల దూరానికి చేరగానే... అంటే డిసెంబర్‌ 3అర్ధరాత్రి తన కౌంటర్‌ వార్‌ స్టార్ట్‌ చేసింది. రాజ్‌పుథ్‌ నుంచి డెఫ్త్‌ఛార్జ్‌ ద్వారా ఆ సబ్‌మెరైన్‌ ముందుకు రాకుండా నీటిలోనే ముంచేసింది. శక్తివంతమైనది అనుకున్న దానిని చచ్చుబడిపోయి సముద్రపు అగాధపు లోతుల్లోకి చేరేలా చేసింది.


అలా.. విశాఖ పట్టణంతోపాటు తూర్పు తీరం మొత్తాన్ని రక్షించింది. లేదంటే ఘాజీ దెబ్బకు ఈస్టర్న్‌ కోస్ట్‌ ప్రాంతం ఇంచుకూడా మిగిలేది కాదు. ఆనాటి నేవీ పరాక్రమానికి, వీరత్వానికి గుర్తుగా ఇప్పటికీ ఆ ఘటన జరిగిన ప్రాంతంలోనే ఘాజీ నిర్జీవంగా పడి ఉంది. అంతటి చరిత్రను నీటి మాటునే, అట్టడుగునే దాచేయలేదు మన నేవీ. తమ విజయగాధను విప్పిచెప్పేందుకు విశాఖలోని మ్యూజియానికి ఘాజీ శకలాలను చేర్చింది. అంతేకాదు.. ఆనాటి విజయానికి గుర్తుగా విశాఖ సాగర తీరంలో నిర్మించిన విక్టరీ స్థూపం ఇప్పటికీ సగర్వంగా నిలిచే ఉంది. సైనికుల సత్తాను నేటి తరానికి చాటిచెబుతోంది. సో.. ఇంతటి సాహసోపేత నిర్ణయంతో  మనల్ని, మన నగరాన్ని సజీవంగా ఉంచిన ఆనాటి నావికా దళానికి సెల్యూట్‌ కొడదాం. జయహో ఈస్ట్రన్‌ నేవీ అని నినదిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: