దేశ రక్షణ పటంలో విశాఖది నిరుపమానస్థానమే. ఇప్పటికే తూర్పు నావికాదళానికి పెట్టని కోటగా ఉన్న ఈ స్టీల్‌ సిటీ.. దేశ రక్షణ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. నౌకాశక్తికి తిరుగులేనికోటగా, రక్షణ పాఠవానికి మేటిగా విశాఖ విరాజిల్లుతోంది.


విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో మహోద్యమం సాగించి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌తో పోల్చితే.. అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతోంది విశాఖ నేవల్ బేస్‌. ఇది తూర్ప తీరప్రాంతం మొత్తానికి ప్రధానమైనది. అంటే.. కోల్‌కతా, చెన్నైతోపాటు విశాఖ, అండమాన్‌ ప్రాంతాలన్నీ ఈ బేస్‌లోకే వస్తాయి. వీటన్నిటికీ హెడ్‌ క్వార్టర్‌గా ఉన్నది విశాఖ సిటీ. అందుకే నేవీకి స్టీల్‌ సిటీ అత్యంత కీలకమైన నగరం.


బంగ్లాదేశ్‌ ఆవిర్భవించడానికి ఆనాటి భారత ప్రభుత్వం అందించిన అసాధారణ సహకారం... తూర్పు నావికాదళం పటిష్ఠతకు, విస్తరణకు కారణమవడం కాకతాళీయం. నిజానికి స్వాతంత్ర్యానికి పూర్వమే దేశ రక్షణ ప్రణాళికల్లో భాగంగా, విశాఖ కేంద్రంగా తూర్పు నావికాదళం ఏర్పాటైంది. కానీ.. ఘాజీ ఘటనతో  తూర్పు తీరంలో నావికాదళాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 


ఘాజీని ముంచేసిన తర్వాత... ఆ విజయానికి గుర్తుగా డిసెంబర్‌ 4న నేవీ డేగా జరుపుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం ఐఎన్‌ఎస్‌లో సర్కార్స్‌లో చిన్న భాగంగా ఉండే బేస్‌ రిపేర్స్‌ ఆర్గనైజేషన్ 1972లో నేవల్‌ డాక్‌యార్డ్‌గా రూపాంతరం చెందింది. అలా దినదినాభివృద్ధి చెంది... ప్రస్తుతం కేరళ, ఒడిశా, బీహార్‌, బెంగాల్‌, తమిళనాడు రాష్ర్టాల యువకులకు ఉపాధి కల్పిస్తూ వసుదైక కుటుంబంలా వర్ధిల్లుతోంది.


భూమి, ఆకాశం, సముద్రంలో యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, దేశ భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ నౌకాదళాన్ని మరంత బలోపేతం చేసే పనిలో పడింది కేంద్రం. ఇందుకోసం భారీగా నిధులు మంజూరు చేస్తోంది. అంటే... రానున్న రోజుల్లో దేశానికే వ్యూహాత్మక నగరంగా మారనుంది మన విశాఖ.


మరింత సమాచారం తెలుసుకోండి: