కాదంటే ఖతమే... మాట వినకుంటే మర్డరే... ఊ కొడితే బతికిపోరు... ఊహూ అంటే ఉరి కంబం ఎక్కుతారు. ఇదీ సోషలిస్టు దేశంగా చెప్పుకుంటున్న నార్త్‌ కొరియాలోని అనువంశిక పాలనలో జరుగుతున్న అరాచక కాండ. దీనికంతటికీ కారణం ఒకటే.. కారకుడు ఒక్కడే.. అదీ ఆ దేశ అధ్యక్షుడే.. చేస్తున్నదంతా అధికార పీఠం కోసమే.


ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌... నియంతలను మించిన నియంత. నిలువెల్లా విషం నింపుకున్న మహా నియంత. అధికారం కోసం తన దేశాన్ని కురుక్షేత్ర సంగ్రామంగా మార్చుతున్న ఘనుడు. మనం చూడని మహాభారత పర్వాన్ని కలియుగంలో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న మూర్ఖుడు. తండ్రి కిమ్‌ జాంగ్‌-2 మరణానంతరం 2011లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఉన్‌.. ఓ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మాట వినకుంటే మర్డర్‌ చేయిస్తున్నాడు. అరాచకాలకు, హత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. అధ్యక్షుడి హోదాలో ఇప్పటివరకు మొత్తం 340మంది ప్రాణాలను బలితీసుకున్నాడు. అంటే.. తన ఆరేళ్ల పాలనలో ఏడాదికి దాదాపు అరవైమంది.. నెలకు ఐదుగురి చొప్పున ఉరికంబం ఎక్కిస్తున్నాడు. 


ఇలా.... అధికారిక హత్యల్లో ప్రాణాలు కోల్పోయిన 140మంది నార్త్‌ కొరియాలోని ప్రభుత్వాధికారులే. ప్రపంచానికి తెలిసేలా జరిగిన ఈ హత్యలే కాదు.. ఏమాత్రం తెలియకుండా చేసిన మరెన్నో మర్డర్లు అతని ఖాతాలో ఉన్నాయి. అంతెందుకు... అయినవారిని, బంధుగణాన్ని సైతం కానరాని లోకాలకు పంపిన కిరాతకుడు. ఇన్ని హత్యలకు కారణమవుతున్నది మాత్రం ఒకే ఒక్కటి.. అదే అధికార దాహం. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఆశే అతడి రక్త దాహానికి కారణమైంది. అందుకే తనకు అడ్డు అనుకున్న వారిని.. అడ్డంకులు సృష్టించేవారిని చంపుకుంటూ పోతున్నాడు. మర్డర్ల మహారాజ్యంగా ఉత్తర కొరియాకు మాయని మచ్చ తెస్తున్నాడు.


నిజానికి కిమ్‌ జాంగ్‌-2 మరణం తర్వాత.. ఆ దేశ ఆనవాయితీ ప్రకారం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాల్సింది అతడి పెద్ద కుమారుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌. కానీ... ప్రపంచాన్ని చూడాలన్న ఆకాంక్షలో భాగంగా నామ్‌.. జపాన్‌ పర్యటనకు వెళ్లారు. అయితే.. ఉత్తరకొరియా వాసుల రాకపై జపాన్‌లో నిషేధం ఉండటంతో అతను చైనా జాతీయుడిగా నకిలీ పాస్‌పోర్ట్‌ సృష్టించి అక్కడ అడుగుపెట్టి దొరికిపోయాడు. ఆ తర్వాత చైనాకు పంపడంతో అక్కడే ప్రవాస జీవితాన్ని గడిపారు. దీన్ని ఎంతో అవమానంగా భావించిన కిమ్ జాంగ్.. తన వారసుడిగా... చిన్న భార్య కుమారుడు ఉన్‌ను ఎంచుకున్నాడు. దీంతో.. జాంగ్ మరణానంతరం.. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా పాలనాపగ్గాలు అందుకుని తన అరాచకాలను మొదలుపెట్టాడు ఉన్.


అయితే అనుకోకుండా వచ్చిన అధికారం ఎక్కడ చేజారిపోతుందోనని భయపడుతూ బతుకుతున్న ఉన్‌... పదవిని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను ఏరివేయాలనుకున్నాడు. దానికి హత్యలే సాధనమని భావించాడు. అంతే.. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వారినేకాదు... స్వంత కుటుంబసభ్యులను సైతం కసాయిలా కడతేర్చడం ప్రారంభించాడు. ముందుగా అధికారానికి అడుగుదూరంలో ఉన్న.. ప్రస్తుత ప్రభుత్వంలో నెంబర్‌ టూగా పనిచేస్తున్న మేనమామపై దేశద్రోహం నేరం మోపి నేలపై లేకుండా చేశాడు. అతడినే కాదు.. అతడి కుటుంబసభ్యులెవరినీ మిగల్చలేదు. అందరినీ అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత.. తన పాలనపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్న తన అన్న నామ్‌ను టార్గెట్‌ చేశాడు. ఏనాడైనా అతనితో ముప్పు రావచ్చునని భావించి పకడ్బందీగా పక్కకు తప్పించాడు.


చైనా నుంచి మలేషియా వెళ్లిన నామ్‌.. అక్కడి నుంచి మకావు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో తన ఏజెంట్లయిన ఇద్దరు మహిళలను అక్కడికి పంపిన ఉన్‌... నామ్‌పై విష ప్రయోగం చేయించి చంపాడు. ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి కూడా. అలా అధికారం కోసం అన్నను సైతం అంతమొందించాడు. అంతేకాదు.. స్వయంగా తన భార్యను కూడా చంపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే.. అతడి భార్య దాదాపు ఏడాదిగా ఎక్కడా కనిపించడంలేదు. గతేడాది మార్చి 28న చివరిసారి భర్త కిమ్‌తో కలిసి బహిరంగ కార్యక్రమంలో కనిపించిన రి సోల్ జు.. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం కూడా ప్రయత్నించలేదు. అందుకే ఉన్నే.. ఆమె ఉసురును తీశాడని అందరూ అనుమానిస్తున్నారు. ఇలా... తనకు అడ్డు తగిలిన వారందరినీ పరలోకాలకు పంపిస్తున్న కిమ్‌జాంగ్‌ ఉన్‌.. అరాచక పాలనతో ఉత్తరకొరియాలో రక్తచరిత్ర సృష్టిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: