జయలలిత నిచ్చెలి శశికళ తానంటే ఎంటో నిరూపించుకుంది. తన దారిరి అడ్డొస్తే ఏం జరుగుతుందో తెలిసేలా చేసింది. తాను సీఎం కాకుండా అడ్డుకున్న పన్నీరుకు పదవి దక్కకుండా చేసి తనంటే ఎంటో నిరూపించింది. జైలులో ఉన్న తన వ్యూహాలకు తిరుగుండదని అటు పార్టీలోని వ్యతిరేకులకు ..ఇటు రాజకీయ శత్రువులకు ఏకకాలంలో తెలియజేసింది. తాను ఎంపిక చేసిన పళని స్వామిని సీఎం సీటుపై కూర్చోబెట్టి దటీజ్ శశికళ అనిపించుకున్నారు. 


అమ్మ మరణం తరువాత హాలీవుడ్ మూవీని తలపిస్తూ సాగిన తమిళ  రాజకీయాలకు జయలలిత నిచ్చెలి శశికళ బ్రేక్ వేశారు. తాను సీఎం కాకపోయినా పర్వాలేదు ..తనను ధిక్కరించి పార్టీలో చిచ్చురేపిన పన్నీరు సెల్వంను సీఎం కాకుండా చూడటమే తన లక్ష్యమంటూ అమ్మ సమాధి సాక్షిగా చేసిన తొలి శపథాన్ని నెరవేర్చుకున్నారు. అమ్మ మరణం తరువాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పన్నీరు సెల్వం స్ధానంలో సీఎంగా తానుండాలని శశికళ భావించారు. ఇందుకోసం ఈ నెల ఆరున పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పన్నీరు సెల్వం చేత రాజీనామా చేయించడంతో పాటు తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారంటూ ప్రకటించారు. ఇదే సమయంలో అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న  పన్నీరు సెల్వం ఈనెల ఏడవ తేదిన అమ్మ సమాధి  చెంతన ధిక్కార స్వరం వినిపించారు. అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతూ ... ఇకపై చిన్నమ్మతో పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. 


పన్నీరు తిరుగుబాటుతో అలర్ట్ అయిన  శశికళ  తన వర్గం ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్స్‌కు తరలించింది. పన్నీరు సెల్వం కవ్వింపు చర్యలకు దిగుతున్నా .. తన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం  ఏమి చేయలేడని భావించి .. పన్నీరు వర్గాన్ని ధీటుగా ఎదుర్కుంది. పార్టీ కోశాధికారిగా ఉన్న  పన్నీరును  పదవి నుంచి తొలగించి .. పన్నీరు సెల్వం తాటాకు చప్పుళ్లకు తాను లొంగేది లేదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో  పన్నీరు సెల్వం ప్రయోగించిన సామ,బేధ, దండోపాయాలు ఎమ్మెల్యేలపై పడకుండా వ్యూహరచన చేసింది. గవర్నర్‌ను కలిసి తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్మానించాలంటూ కోరుతూ 124 మంది మద్ధతుదార్ల జాబితాను అందించింది. ఓవైపు గవర్నర్‌నుంచి ఆలస్యమవుతున్నా తన వర్గం ఎమ్మెల్యేలు జారీ పోకుండా ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకున్నారు. ఆఖరికి హైకోర్టు ఆదేశాలతో పోలీసులు, రెవిన్యూ అధికారులు వచ్చి విచారణ జరిపినా  ... తాము స్వచ్ఛంధంగా రిసార్స్‌లో గడుపుతున్నట్టు ఎమ్మెల్యేలే చెప్పేలా చేయగలిగింది.


ఓవైపు సీఎం సీటు కోసం పోటీ పడుతుండగానే ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు రావడంతో ఆశలు ఆవిరయ్యాయి. తన కల చెదిరిపోయినా  ...తనను ఇబ్బందిపెట్టిన పన్నీరు సెల్వం సీఎం పీఠంపై కూర్చోకూడదని భావించిన శశికళ ప్లాన్‌ బీని అమలు చేశారు. తనకు నమ్మకస్తుడిగా  ఉండటంతో పాటు పన్నీరు సెల్వంను విమర్శించే పళని స్వామిని తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యేల చేత సంతకాలు పెట్టించి  ... ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా వ్యూహాన్ని అమలుచేశారు.  ఇందుకు గవర్నర్‌ కూడా సానుకూలంగా స్పందించడంతో ఎమ్మెల్యేలు జారీ పోకుండా కాపాడుకోవాలని పళని స్వామికి సూచించారు. డీఎంకే, కాంగ్రెస్‌, ఇతర పక్షాలు మద్ధతు ఇచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని .. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు వెళితేనే అధికారం కోల్పోయే అవకాశాలున్నాయంటూ తేల్చి చెప్పింది. ఓటింగ్ సమయంలో పన్నీరు వర్గం శృతి మించితే  ఆయా ఎమ్మెల్యేలపైనే వేటు వేసేలా వ్యూహరచన చేసి పళని స్వామికి గెలుపును చేకూర్చి పెట్టింది. 


ఓటింగ్‌ తీరును జైలులో వీక్షించిన శశికళ .. పళని స్వామి విజయం సాధించిన వెంటనే ఆనందం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనను ధిక్కరించిన పన్నీరుకు తానంటే ఏంటో తెలిసిందని ఇతర ఖైదీలతో చెప్పినట్టు సమాచారం. ముప్పేట దాడులు, కేంద్రం, గవర్నర్‌ల నుంచి సహకారం అందక పోయినా ఎమ్మెల్యేలను కాపాడుకుని తాను కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటు చేయడం ..శశికళ సాధించిన విజయంగానే భావించాలంటున్న రాజకీయ పరిశీలకులు. అమ్మకు పన్నీరు సెల్వం ఎలాగా ఇకపై శశికళకు పళని స్వామి అలాగే ఉంటారని పలువురు నేతలు అభివర్ణిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: