ఏపీ టీడీపీ ఆఫీసు సందడిగా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయం మొదలుకుని సచివాలయం వరకు అన్ని చోట్ల  తెలుగు తమ్ముళ్లు పడిగాపులు పడుతున్నారు. అధినేత చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో  తమకు అవకాశం ఇవ్వాలంటూ ఎవరి వారే తమకు తోచిన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీకి చేసిన సేవలను తెలియజేస్తూ అధినేత దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుండి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం వుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రెండు స్థానాలు ఖాళీలు అయ్యాయి.  ఖాళీఅయిన ఈ తొమ్మిది స్థానాల్లో  టిడిపి తరపున పోటీ చేసేందుకు  ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గుంటూరులోని టిడిపి రాష్ట్ర కార్యాలయంతోపాటు, విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ అభ్యర్ధులు బయోడేటాలతో క్యూలలో నిలబడుతున్నారు. 


ఇప్పటికే ఆయా స్థానాల్లో రిటైర్ అవుతున్న టిడిపి ఎమ్మెల్సీలు... తమకు మరో అవకాశం కల్పించాలంటూ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. ఇక జిల్లాల్లోని సీనియర్లు, ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు తమకు ఈసారైనా అవకాశం కల్పించాలంటూ అభ్యర్థిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత ఎస్.సి.వి. నాయుడు, రాజసింహ, హేమలత, నరేష్ కుమార్ రెడ్డి,  సుభాష్ చంద్రబోస్ ల పేర్లు వినిపిస్తున్నాయి.


 ఇక కడప జిల్లా నుండి మాత్రమే కేవలం ఒక్క బిటెక్ రవి పేరు మాత్రమే ప్రస్తుతానికి వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలో మాత్రం ఈ పోటీ ఎక్కువగానే వుంది.  ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్న శిల్ప చక్రపాణి రెడ్డి, మరోసారి తనకి పొడిగింపు జరగలాని కోరుకుంటున్నారు. అయితే ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డితోపాటు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎన్.ఎం.డి.ఫరూక్ లు కూడా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.  ఇక నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్సీగా వున్న వాకాటి నారాయణరెడ్డితోపాటు, మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.


పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న అంగడి రామ్మోహన్ కు మళ్ళీ అవకాశం కల్పించేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరిలో బొడ్డు భాస్కరరావు పేరునే మరోసారి పరిశీలిస్తున్న టిడిపి, ఒకవేళ కాపు నేతలకు ఈ స్థానం కేటాయించాలనుకుంటే మాత్రం చిక్కాల రామచంద్రరావు, జ్యోతుల చంటబ్బాయ్ ల పేర్లు వినిపిస్తున్నాయి.


ఓవైపు స్థానిక సంస్థల కోటాకు ఇలాంటి డిమాండ్ కొనసాగుతుంటే, మరోవైపు ఎమ్మెల్యేల కోటాలో మరో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు అతి త్వరలోనే ఖాళీలు కానున్నాయి. దీంతో అధికార టిడిపిలో ఎమ్మెల్సీల పండుగ వాతావరణం నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: