నిరుద్యోగ ర్యాలీపై టీఆర్‌ఎస్‌ నేతలు నిప్పులు రాజేస్తున్నారు. కోదండరాం టార్గెట్‌గా మాటలు తూటాల్లా పేల్చుతున్నారు. నువ్వొకటంటే నేను రెండంటా అన్నట్లుగా డైలాగ్‌ వార్‌  కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ను పెంచుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి టీజేఎసీ రూపంలో గట్టిగానే సెగ తగిలింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం టీజేఏసీకి నాయకత్వం వహించిన కోదండరాం... ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా తీరును ఎండగడుతున్నారు. అయితే.... ఇంతకాలం ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చిన పాలకులు... స్వయంగా కోదండరాం రూపంలోనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో షాక్‌కు గురయ్యారు. కౌంటర్‌ అటాక్‌కు దిగారు.


కోదండరాంపై గుస్సా అవుతున్న గులాబీ దండు... ఆయనపై విమర్శల దాడిని పెంచింది. ఉద్యమ సమయంలో కోదండరాంను జేఏసీ ఛైర్మన్ చేసింది కేసీఆరే అన్న సంగతి మరవద్దని.. ఇప్పుడు ప్రతిపక్షాలతో చేతులు కలిపి సీఎంపై విమర్శలు చేయడం సరికాదని కారు గుర్తు నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తలాతోకాలేని డిమాండ్లతో యువతను గందరగోళపర్చవద్దని సూచిస్తున్నారు. కాంగ్రెస్‌ ఏజెంట్‌గా మారిన కోదండరాం.. ప్రభుత్వంపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత.. ఆంధ్ర పాలకుల కుట్రపై ఏనాడూ మాట్లాడని కోదండరాం... ఇపుడు కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు చేయడం సరికాదంటున్నారు. ఆయన ఓ కుబుసం విడిచిన పాము అని ఘాటుగా విమర్శిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి పదేళ్లు పడుతుందని చెప్పిన ఆయనే.. ఇప్పుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, వెంటనే ఈ ధోరణిని మానుకోవాలని సూచిస్తున్నారు.


ఇంకొందరు నాయకులు ఓ అడుగు ముందుకేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీ పేరిట ఆయన శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని, జల్లికట్టు తరహాలో విద్యార్థులందరినీ ఓ దగ్గర చేర్చి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు... కోదండరాం ఓ రాజకీయ నిరుద్యోగి అని.. అతనికి మావోయిస్టులతో లింకులున్నాయని... ఎన్నో క్రిమినల్‌ కేసులు కూడా  ఉన్నాయని విమర్శిస్తున్నారు.


ప్రభుత్వమే కాదు... పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా కోదండరాంపై ఫైరవుతున్నారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అనవసరంగా సర్కార్‌పై నోరు పారేసుకోవద్దని సూచిస్తూనే పలు ప్రశ్నలు సంధించారు. నిరుద్యోగ ర్యాలీలో మీ కుమారుడిని పాల్గొనేలా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోదండరాంకు సవాల్‌ విసిరారు. అయితే.. దీనిని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే తప్పేమిటని నిలదీస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై తమ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని... ప్రశ్నించే వారిపై విరుచుకుపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


ఎవరి వాదన ఎలా ఉన్నా... ఉద్యోగాల విషయంలో సర్కార్ హనీమూన్‌ టైమ్ ముగిసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మూడేళ్లు ముగిశాయి. కల్పించిన ఉద్యోగాలు కేవలం 28వేలు మాత్రమే. మరి రెండేళ్లలో మిగతా 70వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వడం సాధ్యమేనా?. ఒకవేళ మాటకు కట్టుబడితే పరవాలేదు. లేదంటే... ఇప్పటికే ప్రారంభమైన నిరజనజ్వాలలు.. భవిష్యత్‌లో కార్చిచ్చులా మారే ప్రమాదముంది. ప్రభుత్వం పనిపట్టే ఆస్కారం ఉంది. సో.. సర్కార్‌ బీ అలర్ట్‌..


మరింత సమాచారం తెలుసుకోండి: