పౌల్ట్రీ కంపెనీల లాభాపేక్ష కోడి పిల్లలకు పురిటిలోనే నరకం చూపిస్తోంది. హ్యాచరీస్‌లో జరిగే అమానుష చర్యలకు.. కళ్లు తెరవకుండానే కనిపించని లోకాలకు వెళ్తున్నాయి. అడుగులు వేయడం నేర్చుకోకముందే అంతమైపోతున్నాయి. పుట్టుకతోనే లింగ వివక్షకు గురై పురిట్లోనే ప్రాణాలు వదిలేస్తున్నాయి.


గుడ్డును బయటకు వచ్చిన మరుక్షణమే కోడిపిల్ల పెట్టెల్లోకి చేరిపోవాలి. ఎదగాలంటే ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి. కాళ్ల కింద నలిగిపోవాలి, చేతుల్లో చితికిపోవాలి, అయినా నచ్చకుంటే అంతే సంగతులు. పనికిరాదనుకుంటే ప్రాణాలు తీసేస్తారు.

బతికుండగానే గ్రైండర్‌లో వేసి రుబ్బేస్తారు. నీటిలో వేసి నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారు. మంటల్లో వేసి మసి చేసేస్తారు. డ్రమ్ముల్లో వేసి కుక్కేస్తారు.

ఉసురు తీశాక కూడా ఊరుకోరు. చెరువుల్లోని చేపలకు ఆహారంగా వేస్తారు. పరీక్షలన్నీ పాసైతేనే ప్రాణాలుంటాయి. ప్రాణాలు దక్కినా హింస మాత్రం తప్పదు. చికెన్‌ సెంటర్‌కు చేరాలంటే చిన్నపుడే హింసను భరించాలి. కోరుకున్న రుచి కోసం కోడిపిల్లలకు ఎన్నో అగ్నిపరీక్షలుంటాయి.


ముక్కుపచ్చలారక ముందే ముక్కులు కట్‌ చేసేస్తారు.. కోడిపిల్ల పుట్టిన దగ్గర్నుంచి పెద్దయ్యే వరకు జరిగే రాక్షస ప్రక్రియలో ఇదంతా కొద్ది భాగం మాత్రమే. 


ఇదంతా ఎక్కడో కాదు... మన దగ్గరే.. మనచుట్టూనే జరుగుతన్న పాశవిక చర్య ఇది. మనం తినే చికెన్‌కు ముందు పౌల్ట్రీ బిజినెస్‌లో ప్రతిరోజూ జరుగుతున్న తంతు ఇది. కొక్కొరకో అని కూయకముందే కోడిపిల్లలు పడుతున్న బాధలు ఇవి. మన జిహ్వ రుచిని తీర్చేందుకు సిద్ధమవుతున్న జీవాల కథ ఇది... కాదు కాదు... కన్నీటి వ్యధ ఇది.


మరింత సమాచారం తెలుసుకోండి: