మనం నిత్యం వాడే వస్తువుల కోసం ఎన్ని వన్య ప్రాణులను బలిపెడుతున్నామో తెలుసా? ఎన్ని జీవరాశులతో చెలగాటం ఆడుతున్నామో తెలుసా? మనకు తెలియకుండానే మనం ఎన్ని మూగజీవాల ప్రాణాలు తీస్తున్నామో తెలుసా? మన దైనందిన జీవితంలో భాగంగా ఎన్నో వస్తువులను వాడేస్తుంటాం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సివస్తే లెదర్‌ గూడ్స్‌. అంటే.. చర్మంతో తయారైనవి. లైక్‌... లెదర్‌ జాకెట్‌, లెదర్‌ బ్యాగ్‌, లెదర్‌ పర్స్‌, లెదర్‌ బెల్ట్‌... ఇలా లెదర్‌తో తయారైన ఓ వస్తువునైనా చూడగానే ఇష్టపడతాం. కాస్త కాస్ట్‌లీ అయినాసరే కొనేస్తాం. స్టేటస్‌ సింబల్‌గా భావించి వాడేస్తాం. ఇష్టపడి కొనుక్కున్న కారు సీటును సైతం మరింత ఇష్టంగా లెదర్‌తో కుట్టించేస్తాం. కానీ... వాటి వెనక కూడా ఓ కనిపించని దారుణం ఉంది. మనకు తెలియని నిజం దాగి వుంది.


లెదర్‌ గూడ్స్‌ చూడటానికి స్మూత్‌గా కనిపిస్తాయి.. ముట్టుకుంటే మెత్తగా అనిపిస్తాయి. అందుకే అందరూ వాటిని ధరించాలని, వాడేయాలని తహతహలాడుతారు. కానీ అవన్నీ వేటితో తయారవుతున్నాయో తెలుసా.. ఎద్దు చర్మం, నీటిలో అత్యంత ప్రమాదకర జంతువుగా పేరొందిన మొసలి చర్మంతో. అదీ.. చనిపోయాక తీసే చర్మంతో కాదు.. బతికుండగానే చంపేసి వొలిచేసే చర్మంతో... యస్‌... ఇది నిజం. నమ్మాలని లేకున్నా నమ్మక తప్పని వాస్తవం.


లెదర్‌ గూడ్స్‌ తయారీ కోసం మొసలి చర్మాన్ని విరివిగా వాడేస్తున్నారు. వాటితోనే బ్యాగులు, బెల్టులు, పర్సులు, వాచీ బెల్టులు తయారు చేస్తున్నారు. క్రూర జంతువైన మొసళ్లను ఎలా పట్టుకుంటారు, ఎక్కడి నుంచి అన్నింటిని పట్టుకువస్తారు అనేగా మీ అనుమానం. నిజానికి అవేమీ చేయరు. ఎందుకంటే వియత్నాంలో ఏకంగా మొసళ్ల పెంపకం కేంద్రాలే వెలుస్తున్నాయి. అక్కడ పెంచే మొసళ్లను... వాటి చర్మం తీసే ప్రాసెస్‌లో క్రూరాతి క్రూరంగా చంపేస్తారు. సూదులతో పొడిచి, గొంతు కోసి చర్మం వొలిచేస్తారు. వాటితోనే మనం వాడుతున్న, అత్యంత నాణ్యమైన, మన్నికైన లెదర్‌ గూడ్స్‌ను తయారు చేస్తారు.

అయితే.. అలా చర్మం తీసిన మొసళ్లు వెంటనే మృతిచెందవు. ఆ తర్వాత కూడా నాలుగైదు గంటలు ప్రాణంతోనే ఉంటాయి. చర్మం లేకపోయినా వాటి అవయవాలు ఇంకా కొట్టుకుంటూనే ఉంటాయి. అంటే... మన ఆనందం కోసం, మన విలాసాల కోసం వాటిని ఎంతగా హింసిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు.


ఇక.. కార్లలో వాడే లెదర్‌. అంటే మనకు సౌకర్యవంతంగా, మెత్తగా ఉండేలా కుట్టించే సీట్లు, చేతులు నొప్పి పుట్టుకుండా స్టీరింగ్‌కు అలంకరించే చర్మపు తొడుగు, డ్యాష్‌ బోర్డు... ఇలా కారులో వాడే లెదర్‌ ఇంటీరియర్‌ అంతా ఎద్దు చర్మంతో తయారవుతాయి. అదీ అలాంటి ఇలాంటి ఎద్దులతోకాదు. అవి దూడలుగా ఉన్నపుడే ఏరికోరి ఎంపికచేసే వాటి చర్మంతో. ఇలాంటి ఎద్దుల పెంపకానికి  పెట్టింది పేరుగా నిలుస్తోంది బ్రెజిల్‌. అక్కడున్న బుల్‌ సెంటర్లలో సెలెక్షన్‌ ప్రాసెస్‌లోనే దూడల పట్ల పాశవికంగా ప్రవర్తిస్తారు. వాటికి మంటల్లో కాల్చిన ఇనుప చువ్వలతో గుర్తులు వేస్తారు. సూదులతో గుచ్చిగుచ్చి హింసిస్తారు.


ఇక ఉన్నితో తయారైన వస్తువులను మన ఒంటిపై వేసుకుని వెచ్చగా ఉండాలనుకుంటే.. గొర్రెలకు వెచ్చదనాన్ని ఇచ్చే ఉన్నిని వేరుచేయాల్సిందే. అలాంటి ఉన్నిలో ఇటలీ దేశం ఎంతో ఫేమస్‌. అందుకే అక్కడ గొర్రెల పెంపకందారులు ఉన్ని కోసం వాటిని చిత్రహింసలు పెడుతున్నారు. ఉన్నిని వేరుచేసే క్రమంలో క్రూరత్వం చూపిస్తున్నారు. మిషన్లతో ఉన్నిని తీసేటపుడు వాటి ఒంటిపై ఎన్నో గాయాలవుతున్నాయి. ఒక్కోసారి వాటిని ఒడిసి పట్టుకునే క్రమంలో కాళ్లు కూడా విరిగిపోతున్నాయి. అయినా వారు అవేవీ పట్టించుకోరు. పైగా ఇష్టారీతిన వాటిని కాలితో తంతారు. గాయాలు త్వరగా మానేందుకు కెమికల్‌ లిక్విడ్‌ను స్ర్పే చేస్తారు. ఓ వైపు గాయమై అల్లాడుతుంటే.. వాటిపై కారంలా చల్లిన స్ర్పేతో అవి అల్లాల్లాడిపోతాయి.


ఇక.. మెత్తగా కనిపిస్తూ.. డ్రెస్‌లకు అదనపు అందాలు అద్దే మరో రకం ఉన్ని కూడా ఉంది. అదే బాతుల ఈకలతో తయారయ్యేది. ఈ ఈకల కోసం కూడా బాతుల బతుకులతో ఆడుకుంటున్నారు. ప్రాణంతో ఉన్న బాతుల నుంచి బలవంతంగా ఈకలు పీకేస్తున్నారు. బతికుండగానే శవాల్లా మార్చేస్తున్నారు. నోరులేని జీవాలు కదా.. అవి మనల్నీ ఏమీ అనలేవు. ఏం చేసినా తిరగబడలేవు. అందుకే వాటిని అడ్డంగా చంపేస్తున్నాం. గుడ్డిగా లెదర్‌ గూడ్స్‌ను వాడేస్తున్నాం.

అత్యంత కిరాతక చర్యల్లో భాగస్వాములుగా మిగులుతున్నాం. మొత్తంగా మనిషి.. తన ఆనందం కోసం ఎన్నో జీవాలతో ఆడుకుంటున్నాడు. తన అవసరాల కోసం వాటి ప్రాణాలు తీస్తున్నాడు. అయితే... వీటన్నిటినీ వెలుగులోకి తెచ్చింది మాత్రం పెటా సంస్థ. జంతు పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఈ సంస్థే... తమిళనాడులో జల్లికట్టు జంగ్‌కు కారణమైంది. ఇపుడు మన తెలుగు రాష్ట్రాల్లోని హ్యాచరీస్‌లో జరుగుతున్న అమానుష చర్యలను వెలుగులోకి తెచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: