చలికాలం వెళ్లనే లేదు.... అప్పుడే ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధిక  ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.  ఫిబ్రవరి చివరి వారంలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంపై ఆందోళన వ్యక్త మౌతుంది. వాతావరణశాఖ సైతం ఈ సారి ఎండలు గత ఎడాది కంటే  హెచ్చు స్థాయిలో ఉంటాయని హెచ్చరిస్తుంది. దీంతో గత ఏడాది భానుడి ప్రతాపం గుర్తు చేసుకుంటున్న జనం..రాబోయో మూడు మాసాలు ఎలా ఉంటాయోనని  హడలి పోతున్నారు


ఉదయం పది తర్వాత బయటకు వస్తే..భగ్గుమంటున్న ఎండలు జనాన్ని భయపెడ్తున్నాయి. దీనికి తోడుగా వాతావరణ శాఖ అధికారులు ఈ వేసవికి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్టు చెబుతున్నారు. వాస్తవంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి సీజన్ మొదలు కావాలి. కానీ వారం ముందుగానే భానుడు ఈ సారి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మహబూబ్ నగర్ , హైదరాబాద్ లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  హైదరాబాద్ లో  38 డిగ్రీలు... మహబూబ్ నగర్ లో  40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మంలలో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.  మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.


ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఎండలు మండుతుండటంతో.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన నెలకొంది. గతేడాది ఫిబ్రవరి 23వ తేదీన మెదక్ లో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 24వ తేదీన హన్మకొండలో 39.1 డిగ్రీలు, నిజామాబాద్ లో  40.6 డిగ్రీలు నమోదైంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతీ పదేళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతేడాది కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి. గతేడాది కంటే ఈసారి పెరగనున్న ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.


వచ్చే వారం నుంచి ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రస్తుతానికి తటస్థంగా ఉందని... రాబోయే రోజుల్లో అది ఏ స్థితికి వస్తుందో చూడాలని అంటున్నారు. అది కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే ఎండలు ఇంకా మండుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల నుంచే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి అవి మరింత పుంజుకుంటాయని అంటున్నారు.


గత రెండేళ్లుగా రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్ నినో  ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపనుందా?  అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నివో  ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వాతావరణ మోడళ్లూ కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని  స్కైమెట్ శాస్త్రవేత్త లు తెలిపారు. మొత్తంమీద ఈసారి ఫిబ్రవరిలోనే స్టార్ట్‌ అయిన సమ్మర్‌ ఎఫెక్ట్‌.. మూడు నెలలపాటు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: