ఒక్క భయం... ఒకే ఒక్క భయం ప్రజలను నిలువెల్లా వణికిస్తోంది. చనిపోయిన వారు దెయ్యమై తిరుగుతున్నారని ఓ ఊరి ప్రజలు నమ్ముతుంటే... తమను దెయ్యమే ఆవహించిందని మరెంతో మంది విశ్వసిస్తున్నారు. ఇలా.. ఓవైపు టెక్నాలజీలో పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంకా మూఢనమ్మకాల ముసుగులో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు.

ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఊళ్లో ఉన్న వారందరికీ అదే భయం. ఇంట్లో ఉండేందుకు కూడా జంకుతున్నారు. రాత్రి లేదు పగలు లేదు ప్రతీ నిమిషం భయం.. భయంగా గడుపుతున్నారు. చీకటిపడితే ఇక అంతే సంగతులు. ఊరంతా నిశబ్ధం.. ఇళ్లన్నింటికీ ఒకేసారి తాళాలు పడిపోతాయి. ప్రతీ వీధిలో స్మశాన నిశబ్ధం రాజ్యమేలుతుంటుంది. ఊరికేదో అయిందంటూ.. వనవాసం పేరుతో అడవికి పయనమవుతున్నారు. వీరి మూఢనమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు మంత్రగాళ్లు గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నారు. దెయ్యాన్ని జుట్టుపట్టి లాగితే గుట్టంతా తెలిసిపోతుందంటూ మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. దెయ్యం వదిలింపు పేరుతో.. మహిళలతో బీడీలు తాగిస్తారు... ఈలలు వేసి మరీ ఎంకరేజ్‌ చేస్తారు. మూఢ నమ్మకం ముసుగులో దందా చేస్తూ.. గ్రామస్థుల అజ్ఞానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో.. అందనంత దూరంలో ఉన్న అంతరిక్షం ఆనవాళ్ల గుట్టును విప్పుతున్న ప్రస్తుత సమాజంలో... గ్రహాలను సైతం దాటివెళ్తున్న తరుణంలో... ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపుతున్న నేటి రాకెట్‌ యుగంలో... ఇంకా మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి. తగ్గడంలేదు సరికదా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. మూడు నిమ్మకాయలు, ఆరు ఎముకలు అనేంతగా.. జనాలను ఇంకా అజ్ఞానంలోకి నెట్టేస్తూనే ఉన్నాయి. 

ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామం. ఇదేమీ కుగ్రామం కాదు... జిల్లా కేంద్రానికి ఆనుకునే ఉన్న ఊరు. వరంగల్‌, ఖమ్మం క్రాస్‌ రోడ్డులోని ఈ ఊరే ఇపుడు హాట్‌ టాపిక్‌ అయింది. దెయ్యాల ఆవాసంగా మారిందంటూ వార్తల్లోకెక్కింది. ఇంతకాలం నిశ్చింతగా, ఎలాంటి భయంలేకుండా బతుకుతున్న ఈ గ్రామ ప్రజలు.. ఇపుడు అక్కడ ఉండాలంటేనే భయంతో వణికిపోతున్నారు. బయట కాలుపెట్టడం కాదుకదా.. ఇంట్లో కూర్చుని ఉండాలన్నా భయాందోళనకు గురువుతున్నారు. ఎందుకంటే.. వారిని ప్రాణభయం వెంటాడుతోంది.. కాదుకాదు.. దెయ్యం ప్రాణాలు తీస్తుందేమోనన్న భయం పట్టిపీడిస్తోంది.

ఈ ఊరిలో ఒకరి తర్వాత ఒకరుగా మృతిచెందుతున్నారు. మూడు నెలల్లోనే 23మంది మృత్యువాత పడ్డారు. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు... ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియదు. కానీ.. వారానికి ఓ ఇంట్లో, నెలకు నాలుగిళ్లలో చావు డప్పు మోగుతూనే ఉంది. ఇదే... ఇదే కారణం ఈ గ్రామస్తులను భయం గుప్పిట్లోకి నెట్టింది. తమకూ చావు తప్పదేమోనన్న భయం.. గుండెల్లో గుబులు రేపింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపే పరిస్థితిని తీసుకొచ్చింది.

అందుకే ఊరు ఊరంతా కలిసి పండితుడి వద్దకు వెళ్లి ఏం జరిగిందని ఆరా తీశారు. అతడు చెప్పిన మాటవిని భయభ్రాంతులకు గురయ్యారు. ఊరికి కీడు సోకిందని.. గ్రామ ప్రజలందరి ప్రాణాలకు ముప్పుందని తెలుసుకుని నివ్వెరపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పండితుడి చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాన్ని పాటించారు. ఊరు ఊరంతా వనవాసం బాటపట్టారు. తెల్లవారగానే ఇళ్లకు, షాపులకు తాళాలు వేశారు. పిల్లా పాపలతో కలిసి తట్టాబుట్ట సర్దుకున్నారు. ఇంట్లో పొయ్యి కూడా వెలిగించకుండా పొలిమేరలు దాటారు. దీంతో ఊరంతా  నిర్మానుష్యంగా మారింది. నిశ్శబ్ధం రాజ్యమేలింది. సందడిలేక స్మశానాలను తలపించింది.

ఇలా ఇల్లు దాటిన వారంతా.. ముఖాలు కడుక్కోవడం నుంచి వంట, భోజనం అంతా ఆ చెట్లకిందే కానిచ్చేశారు. ఇలా చేస్తే తమ గ్రామానికి కీడు తొలిగిపోతుందని ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇలా.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఊరి బయటే గడిపిన గ్రామస్తులు...  చీకటిపడ్డాక ఇళ్లకు తిరిగొచ్చి దీపాలు వెలిగించారు. మరి.. ఒక్కరోజు ఇలా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లినంత మాత్రాన అంతా మంచే జరుగుతుందా? ఇకపై ఆ గ్రామంలో ఎవరూ చనిపోరా అంటే మాత్రం.. ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు. మొత్తానికి ప్రాణభయంతో నిజాల బాటను మరచి... మూఢ నమ్మకాల్లో మునిగి తేలతున్నారు.

ఇలాంటి ఘటనలు ఈ ఒక్క జిల్లాలోనే జరుగుతున్నాయా? మరెక్కడా  జరగడం లేదా అంటే అదేమీ కాదు.. ఎన్నో జిల్లాల్లో ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరినీ భయం ముసుగులో అవాస్తవాల వైపు అడుగులు వేయిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: