తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించిన గ్యాంగ్ స్ట‌ర్ భ‌వ‌న‌గిరి నయీం అలియాస్ న‌యీముద్దీన్ కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ రావుకు ఉచ్చు బిగుస్తోంది. నయీమ్‌తో సంబంధా లున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్ రావును విచారించారు. భువ‌న‌గిరి రైస్ మిల్ ఓన‌ర్ గంప‌ నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో విద్యాసాగర్ రావును సిట్ ప్రశ్నించింది. సిట్ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ఆయనను విచారించారు. విచారణలో నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ రావు భార్య భూమి కొన్నట్లు అధికారులు గుర్తించారు. 


అంతేకాకుండా తనకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు విద్యాసాగర్ రావు ఒప్పుకున్నారు. విచారణలో భాగంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అయితే గత కొంతకాలంగా  న‌యీం కేసులో రాజ‌కీయ లింకుల‌పై ఆరోప ణల్లో తొలివికెట్ ప‌డ‌నుందా? ఆ తొలివికెట్ మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగర్ రావేనా? న‌యీంతో క‌లిసి భూదందాలు సాగించాడ‌ని, అత‌ని అరాచ‌కాల‌కు తోడ్పాటు అందించాడ‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డంతో సీఎం కేసీఆర్ ఆయ‌న్ని త‌ప్పించనున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు భావించారు. గ‌తేడాది అగ‌ష్టు8 వ తేదీన మహ బూబ్ న‌గర్ జిల్లా షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయిమ్ హతమయారు.

అయితే  న‌యీం ఎన్‌కౌంట‌ర్ త‌రువాత అత‌నికి ఉన్న రాజ‌కీయ లింకులు ఒక్కోటిగా బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చాయి. ఇందులో ప్ర‌తిప‌క్షం, అధికార ప‌క్షం అన్న తేడా లేకుండా పోయింది. ఈ కేసులో ప్ర‌తిప‌క్ష నేత‌లపై చ‌ర్య‌లు తీసుకుంటే... అది క‌క్ష సాధింపు కింద‌కు వ‌స్తుంది. అందుకే, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు రాకుండా.. ముందు త‌న పార్టీకి సంబంధించిన నేత‌ల‌పై చ‌ర్య‌లకు శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగానే ముందుగా రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ఉన్న‌త హోదాలో ఉన్న నేతి విద్యాసాగ‌ర్ రావును త‌ప్పించాల‌ని సీఎం నిర్ణ‌యించిన‌ట్లు గ‌తంలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

ఈ క్ర‌మంలో  న‌యీం బాధితులు ఒక్కొక్క‌రుగా  సిట్‌ను ఆశ్ర‌యిస్తూ వ‌చ్చారు. వీరిలో కొంద‌రు నేతి విద్యాసాగ‌ర్ రావు న‌యీంకు ప‌లు విధాలుగా స‌హ‌క‌రించాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి తోడు న‌యీంతో క‌లిసి విద్యా సాగ‌ర్ రావు దందాలు చేశాడ‌ని, అత‌నికి అన్ని విధాలా స‌హ‌క‌రించాడ‌ని, న‌యీం నిర్వ‌హించిన అన్ని కార్య‌క్ర‌మా ల‌కు హాజ‌ర‌య్యాడ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఒకే వ్య‌క్తిపై ఇన్ని ర‌కాల ఆరోప‌ణ‌లు రావ‌డం ప్ర‌భుత్వానికి మ‌చ్చ తెస్తుంద‌న్న ఆందోళ‌న‌తో ఆయ‌న్ను త‌ప్పించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా నేతి విద్యాసాగర్ స్టేట్ మెంట్ ను ఆదివారం సిట్ అధికారులు నమోదు చేశారు. భువనగిరి వ్యాపారి నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. సుమారు 3 గంటల పాటు విద్యాసాగర్ ను విచారించినట్టు తెలిసింది. నయీంతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే నయీంతో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నట్టు సమాచారం. నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్‌ భూమి కొన్నట్టు సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తోంది.

నయీమ్‌ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ చీఫ్‌ గత నెలలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని, 107 మంది పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామని, 18 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. త్వరలోనే మిగతా కేసుల్లోనూ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మ‌రి నేతి విద్య‌సాగర్ రావు పై ప్ర‌భుత్వం ఏలాంటి చ‌ర్య‌లు తీస‌కోనుందో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: