స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తీన్‌మార్‌ కొట్టింది. మొత్తం మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రతిపక్ష నేత జగన్‌ సొంత జిల్లాలో కూడా టీడీపీ గెలవడం.. తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నింపుతోంది.


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు గెలిచారు. 40 ఏళ్లుగా వైఎస్‌ కంచుకోటను తాము బద్దలు కొట్టామంటూ తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో.. టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి... వైసీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 433 ఓట్లు రాగా.. వైసీపీకి 399 ఓట్లు వచ్చాయి. బీటెక్‌ రవి 34 ఓట్ల తేడాతో గెలుపొందారు.

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 64 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి  565 ఓట్లు రాగా.. వైసీపీకి  501 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లనివిగా ప్రకటించగా.. ఒకటి నోటా వచ్చింది. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు. 56 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై శిల్పా చక్రపాణి విజయం సాధించారు. మొత్తానికి చూస్తే దివంగత నేత భూమా నాగిరెడ్డి కల నెరవేరిందని చెప్పుకోవచ్చు. ముందు నుంచే భూమా-శిల్పా కుటుంబాల మధ్య విభేదాలు ఉండేవి. వైసీపీని వీడి భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ టీడీపీ కండువా కప్పుకున్నారు.. అయితే ఇద్దరూ ఒకే గూటిలో ఉండటంతో అప్పట్నుంచి భూమా- శిల్పా ఫ్యామిలీ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులు ఉండేవి. దీంతో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరిని ఏకం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా విజయానికి సాయశక్తులా ప్రయత్నాలు చేశారు.

నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన గంటకే ఫలితాలను కలెక్టర్‌ ప్రకటించారు. ఈ ఫలితాలలో వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై.. టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 852 ఓట్లుండగా.. ఎన్నికల్లో 851 ఓట్లు పోలయ్యాయి. అందులో 465 ఓట్లు టీడీపీకి, 378 ఓట్లు వైసీపీకి వచ్చాయి. కడప, కర్నూలు, నెల్లూరు ఈ మూడు జిల్లాలూ గతంలో వైసీపీకి చెందినవి. అంతేకాకుండా వైసీపీకి చెందిన స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులే టీడీపీ ఓటు వేయడం అనేది టీడీపీకి రాయలసీమలో నైతికంగా అందించిన విజయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఫలితాలతో టీడీపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: