దేశానికి అన్నం పెట్టే రైతన్న.. రాజకీయ నాయకులకు వరంగా మారాడా ? ఆపదలో ఉన్న అన్నదాతను ఆదుకుంటున్నామంటూ.. రైతుల ఓట్లకు ఎరవేస్తున్నారా ?  రుణమాఫీ హామీతో గుంపగుత్తగా ఓట్లు వచ్చి పడతాయని భావిస్తున్నారా ? రుణమాఫీలతో  ఆర్ధిక వ్యవస్ధకు ఇబ్బంది అని తెలిసినా... ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే  అవకాశాలున్నా.. నాయకులు ఆ దిశగా ఆలోచించడం లేదా ?  అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  

ఎన్ని పుణ్యాలు చేసి జన్మించినావో ..
ఈ ధరాభామినీ నీ మధురాథరాన అమృతమోలకించే ఈ హలముతోనా 
హాలికా నీకు వేలవేల దండాలు అంటూ  రైతులను కీర్తించారు ప్రజా కవి దాశరధి. ఎన్నో జన్మల పుణ్యఫలంతో రైతుగా జన్మించే అవకాశం లభిస్తుందని  ... అలాంటి వారికి వేల దండాలు పెట్టాల్సిన అవసరముందని ధాశరధి భావన. కాని ఇప్పుడు పరిస్ధితి మారింది.  అఖిలాండకోటికి ఆకలి తీర్చే శక్తి ఉన్న రైతు.. ఇప్పుడు తన కడుపు తాను నింపుకోలేకపోతున్నాడు. తనను నమ్ముకున్న వారికి  కూడా పట్టెడన్నం పెట్టలేని దుస్ధితికి చేరుకున్నాడు. కలసిరాని కాలానికి సహకరించని పాలకులు తోడు కావడంతో అన్నదాత పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది.  ఏటికిఏడు పెరుగుతున్న  పెట్టుబడులు, రెట్టింపయ్యిన అప్పులు.. రైతును సంక్షోభంలోకి నెట్టాయి. విధిలేని పరిస్ధితుల్లో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. 1988లో ప్రకాశం జిల్లాలో  తొలి రైతు ఆత్మహత్య నమోదయ్యింది. శనగ పంటకు పచ్చ పరుగు సోకి ఆశించిన స్ధాయిలో దిగుబడి రాకపోవడంతో  రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 1995 నుంచి 2003 వరకు దేశంలో లక్షా 38 వేల 321 రైతులు ఆత్మహత్య చేసుకోగా   .. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం 2004 నుంచి 2012 వరకు లక్షా 46 వేల 373 మంది రైతులు బలవన్మరాలకు పాల్పడ్డారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేల 898  మంది రైతులు ఉన్నారు. ఈ లెక్కన దేశంలో ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో రైతుల సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు కమిటీలు వేసి అధ్యయనం చేశాయి.  ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో  86.5 శాతం మంది అప్పుల బాధ తాళలేకే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇందులోనూ  ఏక పంటను సాగు చేయడం, వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నట్టు అధ్యయనంలో తేలింది. ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని.. పలు కీలకమైన సిఫారసులు చేశారు. ఇందులో ధరల స్థీరీకరణ, పెట్టుబడి వ్యయం తగ్గింపు, ఎరువులు, విత్తనాలు, పురుగు ముందులకు సబ్సిడీల అందించడం, ఆధునిక యాంత్రీకరణను వినియోగంలోకి తేవడం వంటి కీలకమైన సిఫారసులు ఉన్నాయి. అయితే వీటిని పక్కనబెట్టిన ప్రభుత్వాలు రాజకీయ కోణంలో తమదైన శైలిలో వాగ్ధానాలు ఇవ్వడం ప్రారంభించాయి.

రైతు చరిత్రలో తొలిసారిగా ఉచిత విద్యుత్ అనే వాగ్ధానాన్ని  ఉమ్మడి ఏపీలో 1999 లో  కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తొలి సారి ఆశించిన స్ధాయిలో ప్రయోజనం దక్కకపోయినా.. రెండో సారి అనూహ్య స్పందన లభించింది. ఉచిత విద్యుత్ వాగ్ధానంతో 294 స్థానాల్లో 245 స్ధానాలను మిత్రపక్షాలతో కలిసి ఆ పార్టీ దక్కించుకుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు రుణమాఫీని అమలు చేసింది. నాలుగు కోట్ల 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా 60 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది.


2014 ఎన్నికల్లో మరోసారి రైతు రుణమాఫీ అంశం తెరమీదకు వచ్చింది. ఈ సారి కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ నినాదం ప్రతిద్వనించింది.  తాము అధికారంలోకి వస్తే బేషరతుగా రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ఏపీలో టీడీపీ హామీ ఇవ్వగా , తెలంగాణలో టీఆర్‌ఎస్ ఇదే రకమైన హామి ఇచ్చింది. తమకు అధికారం వస్తే లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. రెండు చోట్ల ఈ ప్లాన్ వర్కవుట్ కావడంతో రైతుల ఓట్లతో ప్రభుత్వాలు గద్దెనెక్కాయి. ఏపీలో ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. అయితే  ఒక్క కలం పోటుతో  రైతుల రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని అనుభవపూర్వకంగా గ్రహించిన చంద్రబాబు.. విడతలవారీగా చెల్లింపులకు సిద్ధమయ్యారు. నిబంధనల పేరుతో  లబ్ధిదారుల సంఖ్య తగ్గించే యోచనలో  కోటయ్య కమిటీ ఏర్పాటు చేసి .. రుణమాఫీ విధివిధానాలపై నివేదిక ఇవ్వాలంటూ కోరారు. 

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేటప్పటికి ఎస్‌ఎల్ బీసీ నివేదికల ప్రకారం కోటి 14 లక్షల మంది రైతులకు సంబంధించి 87 వేల 612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలున్నాయి. ఇంత భారీ స్థాయిలో మాఫీ సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన బాబు.. కోటయ్య కమిటీ సూచనలకు అనుగుణంగా కుటుంబానికి లక్షా 50 వేల రూపాయలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందులోనూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట పరిమితులు విధించారు. దీంతో పాటు ఉద్యాన పంటల రుణాలను  రుణమాఫీ నుంచి మినహాయించడం, బంగారు తాకట్టు ఉంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను ఫ్లెడ్జ్‌ రుణాలుగా చూపడం,  స్ధానికత లేని వారికి రుణమాపీ వర్తించకుండా చేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్యను  కోటి 14 లక్షల నుంచి 82.66 లక్షలకు ..అక్కడి నుంచి   పలు వడపోతల అనంతరం రుణమాఫీకి  40. 43 లక్షల మందే అర్హతగా నిర్ణయించారు.  రుణమాఫీ మొత్తాన్ని కూడా  14 వేల 322 కోట్లుగా నిర్ధారించి.. దశల వారిగా నిధులు విడుదల చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి విడతగా 4 వేల కోట్లు,  రెండో విడతగా 3100 కోట్లు,మూడో ధఫా 3500 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు 10 వేల 600 కోట్ల రూపాయలు  కేటాయించారు. అయితే ఇప్పటి వరకు చాలా మంది రైతులకు తగిన స్థాయిలో రుణ మాఫీ జరగలేదని వాస్తవం.   

ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  87 వేల కోట్ల రూపాయలను 14 వేల కోట్లకు తగ్గించమంటే రైతులకు ఏమేర ప్రయోజనం చేకూరిందో తెలుసుకోవచ్చంటూ ఎద్దేవా చేస్తున్నారు. ముందు చూపు లేకుండా ఇలా వాగ్ధానాలు కురిపించడం వల్ల అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి మధ్యలోబ్యాంకులకు  కూడా ఇబ్బందులు తలెత్తాయని చెబుతున్నారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో ప్రభుత్వం నిర్ధేశించిన వ్యవసాయ రుణ ప్రణాళికను ఒక్క సారి కూడా చేరుకోలేక పోయారని ..దీనికి ప్రధాన కారణం రుణమాఫీ జరగకపోవడమేనని బ్యాంకింగ్‌, ఆర్ధిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకులకు రావాల్సిన నిధులు భారీగా తగ్గాయని .. బకాయిలు చెల్లింపులు భారీగా నిలిచిపోవడంతో ఎన్‌పీఏలు పెరిగి బ్యాంకులకు గుదిబండగా మారిందంటూ చెబతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని  ..ఇచ్చిన హామికి అనుగుణంగా రుణమాఫీ చేసి తీరుతామంటున్నారు అధికార పార్టీ నేతలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: