అంతా అనుకున్నట్టే అయింది. తాజా నిర్ణయంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించని సిరియా, నికరాగువా దేశాల సరసన అమెరికా చేరింది. పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు పెను విఘాతం ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో అమెరికాది రెండో స్థానం. ఈ వాతావరణ ఒప్పందాన్ని అమలు చేయడానికి 190 దేశాలకు పైగా అంగీక రించాయి.

తమ దేశం, పౌరుల పట్ల ఉన్న విద్యుక్త ధర్మాన్ని నిర్వహించేందుకే ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు శ్వేతసౌధంలో ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేలా కొత్త షరతులతో ఇదే ఒప్పందంలో కొనసాగడమా? లేక కొత్త ఒడంబడికను రూపొందించడమా అన్నదానిపై చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

ప్రస్తుత ఒప్పందం అమెరికా ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉందన్నది ట్రంప్‌ వాదన. "ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమే కాదు. ఉద్యోగ కల్పననూ దెబ్బతీస్తుంది. భారత్‌, చైనా లాంటి దేశాలకు ఇది అనుకూలంగా ఉంది" అని ట్రంప్‌ అన్నారు.

ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో, ఉద్గారాలను తగ్గించే భారం ఇతర దేశాలపై మరింతగా ఉండనుంది. చైనా, భారత్‌, ఐరోపా లోని దేశాలు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఇంతకుముందే స్పష్టం చేశాయి.

 

అమెరికా సహా 187 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే, నాటి అధ్యక్షుడు ఒబామా అనాలోచితంగా పారిస్‌ ఒప్పందంలో భాగస్వామి అయ్యారని, తాము అధికారంలోకి వస్తే ఒప్పందం నుంచి వైదొలుగుతామని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు పారిస్‌ ట్రిటీ నుంచి బయటికొచ్చేశారు. ఈ నేపథ్యంలో ఒప్పందం అమలు చేయించాల్సిన బాధ్యతను ఎవరు తలకెత్తుకుంటారో వేచిచూడాలి.

  • పెరుగుతున్న భూగోళం ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువకి అదుపు చేయాలి, అవసరమైతే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు మరింతగా కృషి చేయాలి.
  • వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలపై ఐదేళ్ళకోసారి జాతీయ సమీక్ష జరగాలి.
  • అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు పరస్పరం సహకరించుకోవాలి.
  • వర్ధమాన దేశాలకు సాయంగా 2020 నుండి ఏడాదికి వంద బిలియన్ల డాలర్లు చొప్పున అగ్రదేశాలు నిధులు అందచేయాలి.
  • నిధులు పొందే దేశాలు.. అసలు లక్ష్యంవైపు పయనిస్తున్నాయా? లేదా? అనేదానిపై ప్రతి ఐదేళ్లకోసారి సమీక్ష జరగాలి.

 

పారిస్ ఒప్పందానికి ఇదీ నేపథ్యం -

గత 50 కోట్ల సంవత్సరాల్లో జరిగిన ఐదు మహోత్పాతాలు భూమిపై పలు జీవజాతులను తుడిచి పెట్టేశాయి. డైనోసారస్ లాంటి భారీ సరీసృపాలు (ఒక రకమైన జంతువులు) కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం మరో మహోత్పాతానికి దారితీసే భయానక పరిస్థితులు భూమి మీద నెలకొన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

గతంలో జరిగిన ఉత్పాతాలకు గ్రహ శకలాల తాకిడి వంటి ప్రకృతి శక్తులు కారణమైతే, కొత్తగా రానున్న ఆరో మహోత్పాతా నికి మనిషే కారణమని చెప్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని, ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటే ఆ మహా వినాశనంనుంచి తప్పించు కోవచ్చని హితవు చెప్తున్నారు వాతావరణ శాస్త్రవెత్తలు. వాతావరణ సమతుల్యత పరిరక్షణ సాధించడానికే 2015 లో పారిస్ ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి.

గత ఐదు మహోత్పాతాల్లో జీవరాశులు అంతరించినంత వేగంగా ప్రస్తుతం క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు కూడా అదే స్థాయిలో అంతరిస్తున్నాయని వీరు తెలిపారు. మానవుడి వికృత చేష్టలైన అవధుల్లేని వేట, జీవరాసుల ఆవాసాల ఆక్రమణ లు, కాలుష్యం తదితర మానవ చర్యలతో 25 శాతం క్షీరదాలు, 13 శాతం పక్షులతోపాటు లక్షల జీవజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయని హెచ్చరించారు.

కొన్ని శతాబ్దాలుగా భూమి మీద, సముద్రాల మీద మానవుడు విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా జరుపుతున్న కార్యకలాపాలతో జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. జీవజాతుల మీద దాడు లతో వాటి సహజ ఆవా సాల ధ్వంసం, సహజ వనరులను విపరీతంగా కొల్లగొట్టటం, మానవ దౌష్ట్యాల కారణంగా ఉద్భవించిన వాతావరణ మార్పులు, ఓజోన్ పొర కరిగి పోయి విచ్చిన్నమవటం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు విచ్చలవిడిగా పెరిగి దృవాల్లో మంచుకరిగి ధారుణ ఉత్పా తాలకు కారణమౌతున్నాయి. ఇలాంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా జీవజాతులు విపరీతమైన వేగంతో అంత రిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ఈ వినాశకర ప్రక్రియ కొనసాగుతున్నదని శిలాజాలపై జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తు న్నాయి. దీని ఫలితాలు దారుణంగా ఉండే ప్రమాదం ఉంది. జీవ వైవిధ్యాన్ని కోల్పోతే, ప్రస్తుతం ప్రకృతి నుంచి లభిస్తున్న అనేక వసతులను మానవాళి కోల్పోయే పరిస్థితి వస్తుంది.

ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే మనిషి కార్యకలాపాల కారణంగా భూమ్మీద ఇతర జీవజాతుల ఉనికికే భంగం వాటిల్లటం అనేది ఇప్పుడే కొత్తగా కనిపించే విషయం కాదు. మానవాళి పరిణామక్రమంలో ఈ చీకటి అధ్యాయం కూడా మిళితమయ్యే ఉంది.

వేట వంటి మానవ కార్యకలాపాలతోపాటు ప్రకృతిలో సంభవించిన మార్పుల కారణంగా 50 వేల ఏండ్ల కిందట ఆస్ట్రేలియా లో, 10 వేల ఏండ్ల కిందట ఉత్తర, దక్షిణ అమెరికాల్లో, 3,000-12,000 ఏళ్ల మధ్య యూరప్‌లో జీవజాతులు భారీ ఎత్తున నశించి పోయా యి. ఈ వినాశనం కొనసాగుతూ వచ్చింది. దాదాపు 3,000 ఏండ్ల కిందట భూమిపై 44 కిలోలకు పైగా బరువు ఉన్న క్షీరదజాతులు సగం వరకూ అంతరించిపోయాయి. పక్షి జాతుల్లో 15 శాతం తుడిచిపెట్టుకుపోయాయి. ఆధునిక, పారిశ్రామిక యుగానికి నాంది పలికిన క్రీస్తుశకం 1500 నుంచి ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

భూమి మీదున్న జీవజాతుల్లో అత్యంత తెలివైన జీవిగా పేరొందిన మనిషే.. సమస్త జీవజాలానికి పెనుముప్పుగా పరిణమించటం ఒక మహావిషాదం. నాగరికత పేరుతో జరుగుతున్న ప్రస్థానంపై పునఃసమీక్ష జరుపుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆరో మహోత్పాతం నివారణకు ఇప్పటికీ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు మానవాళికి హెచ్చరికతో కూడిన భరోసా నిస్తున్నా రు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, సామాజిక పరిశోధకులు కలిసికట్టుగా కృషి చేయాలని వారు సూచిస్తున్నారు.

జీవజాతుల ఆవాసాలను కాపాడటం,

మన ఆహారం కోసం వ్యవసాయం వంటి రూపాల్లో భూమి మీద కొనసాగుతున్న ఒత్తిడిని కొంత తగ్గించి ప్రత్యామ్నాయ ప్రక్రియల ద్వారా ఆహార సముపార్జన,

పర్యావరణ సమతుల్యత పరిరక్షణ వంటి చర్యలను తక్షణం, పరస్పర సహకారంతో, భారీ ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు.

మానవ చర్యల కారణంగా జీవవైవిధ్యం ఇంతగా దెబ్బతిన్నా కూడా భూమి ఇప్పటికీ మనకు రక్షణనివ్వగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2060 నాటికి మానవ జనాభా 1000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

ఇంతటి జనాభాకు మాత్రమేగాక భూమి మీదున్న ఇతర జీవజాతులన్నింటికీ అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని భూమి అందించగలదని, ఆ వనరులు పుడమి తల్లి ఒడిలో ఉన్నాయని వారు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: