కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి కన్నుమూశారు. కులుమనాలిలో గుండుపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశం కోసం ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు మనాలి వెళ్లారు. అక్కడ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో సహచర ఎంపీలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కన్నుమూత

1936, నవంబర్‌ 20న జన్మించిన పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి స్వస్థలం మహబూబ్‌ నగర్‌ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా, 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఎంపీగా ఉన్నారు.  కాగా ఆయన భౌతికకాయాన్ని కులుమనాలి నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పాల్వయి ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ సంతాపం తెలిపింది. 



కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పాల్వాయి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్బంగా పాల్వాయితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్థివదేహాన్ని సిమ్లా నుంచి హైదరాబాదుకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా వెంటనే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: