భారత్ చైనా ల మధ్య ఘర్షణ వాతావరణం అంతకంతకూ వేడెక్కుతుంది. సిక్కిం సరిహద్దు వివాదం పై రెండు దేశాలు మాటల తూటాలు వదులుతున్నాయి.  భారత్ చరిత్ర మర్చిపోయిందని చెబుతూ, గతంలో జరిగిన యుద్ధాల్లో భారత్ ఓటమిపాలవడాన్ని చైనా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ‘భారత్ అప్పటిది కాద’ని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌పై తమ మాటల దాడిని చైనా అధికార వార్తా సంస్థలు తీవ్రతరం చేశాయి.


బుస కొడుతున్న డ్రాగన్‌

వివాదాస్పద డోక్లామ్‌లో ఉద్రిక్తత తీవ్రమవుతోందని చెబుతూ అక్కడి నుంచి భారత సైనికులు మర్యాదగా వెళ్తారా లేక బలవంతంగా గెంటేయాలా? అంటూ వార్తా పత్రికలు తమ సంపాదకీయంలో పరుష పదజాలంతో రెచ్చిపోయాయి. అయితే భారత్‌ ఆశ్చర్యకరంగా వేరే దేశంలోకి చొరబడి అంతర్జాతీయ సంబంధాల మౌలిక నిబంధనలను తుంగలోకి తొక్కుతోంది. భారత సైనికులు మా భూభాగంలోకి చొరబడటం తీవ్రమైన విషయం’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెన్‌ సువాంగ్‌ బుధవారం ఆరోపించారు.



భారత సైనికులు ఇంకా తమ భూభాగంలోనే ఉన్నారని, ఇప్పటికైనా భారత ప్రభుత్వం సైనికులను వెనక్కి పిలవాలని, ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థాయికి వచ్చేలా చూడాలన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు ప్రస్తుతం ఘర్షణల నేపథ్యంలో తగు జాగ్రత్తలు వహించాలని ఆ దేశానికి చెందిన అధికార వార్తా పత్రికలు ఇప్పటికే హెచ్చరించాయి. భారత్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని గ్లోబల్‌ టైమ్స్‌ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: