వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తే ఎటువంటి ఫ‌లితం ఉంది? పాద‌యాత్ర ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌లపై ప‌డుతుందా? వైసీపీ అధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చాలా ముఖ్య‌మా? ఇప్పుడు వైఎస్సార్ సీపీలో ఈ విష‌యాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీలోని 13 జిల్లాల్లో జగన్ పాదయాత్ర వైసీపీకి ఓట్లు తెచ్చి పెడతాయా? లేదంటే యాత్రను ఏపీ ప్రజలు లైట్‌గా తీసుకుంటారా? అనే విష‌యాల‌పై ఆ పార్టీలో చ‌ర్చ‌మొద‌లైంది. నిజానికి ఏపీలో పాదయాత్రల పర్వం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. 


2004 ముందు తన తండ్రి వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర సంచలనమే అయింది. 60 ఏళ్ల వయస్సులో వైఎస్ పాదయాత్ర సాహసం చేయడాన్ని ప్రజలు స్వాగతించారు. నిజానికి వైఎస్ పాదయాత్ర వల్లనే కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వ‌చ్చింద‌ని సూటిగా చెప్ప‌లేం. అప్పటికి పదేళ్ల నుంచి చంద్రబాబు పరిపాలన కొనసాగుతోంది. పదేళ్ల టీడీపీ పాలనపై విసుగెత్తిపోయిన ప్రజలు, అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు వైఎస్ నాయకత్వానికి పట్టం కట్టారన్నది వాస్తవం. అయితే 2004లో కాంగ్రెస్ పార్టీ విజయవానికి వైఎస్ పాదయాత్ర కూడా కొంత దోహదం చేసింది. తిరిగి 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేశారు. ఆయనకు ఆరుపదుల వయసులో పాదయాత్ర చేయడం సాహసంగానే చెప్పుకోవచ్చు.


చంద్రబాబు పాదయాత్ర తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసిందని, కొత్త రాజధాని, కొత్త కొలువులు తమకు రావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని ఏపీ ప్రజలు విశ్వసించారు. చంద్రబాబు అయితే రాష్ట్ర రాజధానిని మరో హైదరాబాద్ గా మార్చగలరని ప్రజలు నమ్మారు. అందుకే చంద్రబాబుకు పట్టం కట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాదయాత్రకు తోడు రాష్ట్ర విభజన కూడా జరగడం టీడీపీకి కలిసొచ్చింది.


అయితే ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే ఫ‌లితం ఉంటుందా అని విశ్లేషిస్తే అనుకూల‌త‌నే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఒకే ఒక సెంటిమెంట్ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ పాద‌యాత్ర‌లో ప్ర‌ధానంగా వాడుకోవ‌చ్చు. పాద‌యాత్ర‌లో ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్‌తో పాటు రైతు సమస్యలు, డ్వాక్రా మహిళలు, రాజధాని అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాలను జగన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జగ‌న్‌కు ప్ర‌జ‌లు జై కొడ‌తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: