"విదేశాల్లో నాకు ఒక్క రూపాయి అయినా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుజువు చేస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాను. అందుకు చంద్రబాబుకు 15 రోజులు సమయం ఇస్తున్నాను. రుజువు చేయలేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా?" అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. 


ఏవో ప్యారడైజ్‌ పేపర్లంటూ పనిగట్టుకుని తనపై వార్తలు రాయిస్తున్నారని, బురద చల్లుతున్నారని మండిపడ్డారు. "ప్రజాసంకల్ప పాదయాత్ర" చేస్తున్న జగన్‌ కమలాపురం నియోజకవర్గం లోని వీరపునాయునిపల్లె లో జరిగిన బహిరంగసభలో బుధవారం ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయాలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో విశ్వసనీయతను తీసుకురావడానికి, చంద్రబాబు మాటఇచ్చి తప్పిన ఫలితంగా వడలిపోతున్న రైతులు, పేదవర్గాలకు మేలు చేయడానికి, మోసం చేసిన టీడీపీప్రభుత్వం ఎల్లకాలం ఉండదని చెప్పి, వారికొక భరోసా ఇచ్చి తోడుగా నిలవడానికే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు.

జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే:   

జగన్‌కు విదేశాల్లో డబ్బులున్నట్లు ఏవో ప్యారడైజ్‌ పేపర్లలో పేరు వచ్చిందని నిన్నటి నుంచీ కొన్ని పత్రికల్లో వార్తలు రాస్తున్నారు, టీవీ ల్లోనూ ప్రసారం చేస్తున్నారు. నేనే దైనా గొప్ప కార్య క్రమం తలపెట్టినప్పుడే హఠాత్తుగా ఇలాంటి వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు బృహత్తరమైన పాదయాత్ర మొదలు పెడుతున్నాను కదా! ఏదో ఒక పేపర్లో చిన్న లీక్‌ ఇప్పిస్తారు. ఆ లీకును అందిపుచ్చుకుని చంద్రబాబు తోక పత్రికలు దానిని పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాస్తాయి. కొన్ని టీవీ చానెళ్లు, పత్రికలు కూడా టీడీపీ చెప్పినదానికి డోలు కొడుతుంటాయి. 


నిన్న, ఇవాళ 48 గంటల పాటు టీవీ చానళ్లు అంతా తమ సమయాన్ని వృథా చేశాయి. ఆ సమయం ప్రజా సమస్యల కోసం కేటాయించి ఉంటే కనీసం వారికైనా  మేలు జరిగి ఉండేది. కానీ, జగన్‌ పాదయాత్రను చూపించకూడదనే దుర్బుద్ధితో, జగన్‌ మీద ఏదో ఒక వివాదాస్పదమైన అంశాన్ని చూపించాలన్న కుట్రతో వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయ్యా! చంద్ర బాబూ! 15 రోజుల సమయం తీసుకోండి. నాకు ఒక్క రూపాయి అయినా విదేశాల్లో ఉందని ఋజువు చేయండి. రాజకీయాల నుంచి  తప్పు కుంటాను. ఋజువు చేయలేకపోతే మీరు మీ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? 


చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధం చెబుతారు. నాకు నిజంగా విదేశాల్లో డబ్బు ఉంటే, నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయి ఉండేవాళ్లమా! ఆ ఎన్నికల్లో ఓటుకు రూ.6000 నుంచి రూ.10000  ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలు కొనుగోలు చేసినట్లుగా చేసింది ఎవరు? తెలంగాణలో ఎమ్మెల్యేలను నల్లధనం తో కొనుగోలు చేస్తూ సూట్‌ కేసులతో అడ్డంగా దొరికిపోయింది ఎవరు? నువ్వా? నేనా? ఆ నల్లధనమంతా ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పు చంద్రబాబూ! 


చంద్రబాబు చేసే వన్నీ వెధవపనులే, చెప్పేవిమాత్రం శ్రీరంగనీతులు. నేనేదైనా గొప్ప కార్యక్రమం చేసే సమయానికి ఏదో ఒక వార్తను ప్రచారంలోకి తీసుకొస్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందనే విషయం మీ అందరికీ తెలుసు. సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు బీజేపీతో వైఎస్సార్‌సీపీ కలుస్తున్నట్లు "రిపబ్లిక్‌ టీవీ" లో వచ్చిన కథనాన్ని ఒక తోక పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అసలు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నదెవరు? వారి మంత్రి వర్గంలో ఉన్నదెవరు? మధ్యలో జగన్‌ ఎక్కడి నుంచి వచ్చాడు? అని నాకు ఆశ్చర్యం వేసింది. నంద్యాలలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం సోదరుల మనసుల్లో విషం చిమ్మాలనే ప్రయత్నంలో భాగమే ఆప్రచారమంతా. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, చేసే వన్నీ కుట్రలని దీన్ని బట్టి స్పష్టం అవుతోంది.  


రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఫలానా హామీని నెరవేర్చానని చెప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలంటే ప్రజల నుంచే చైతన్యం రావాలి. ఒక రాజకీయ నేత మైక్‌ పట్టుకుని ప్రజలకు హామీలిచ్చి, అధికారం లోకి వచ్చాక నెరవేర్చలేక పోతే రాజీనామా చేసే పరిస్థితి రావాలి. అపుడు రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది. మన మేనిఫెస్టోను ప్రజలే తీర్చిదిద్దుతారు. మన మేనిఫెస్టో 2 లేదా 3 పేజీలే ఉంటుంది. మేం చేసేవే అందులో పెడతాము. అధికారంలోకి వచ్చాక అందులో చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేసి చూపిస్తాము. ఆ తరువాత 2024లో వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఆశీర్వదించమని ఓట్లడుగుతాం.


ఉదయం 8.45 గంటలకు నేలతిమ్మాయిపల్లె సమీపంలోని తన విడిది నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవి ష్కరించారు. అనంతరం గోనుమాకుల పల్లె, వీరపునాయునిపల్లె వరకు పాదయాత్ర చేసి అక్కడ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడే బహిరంగసభలో ప్రసంగించారు. ప్రజాసంకల్ప యాత్రపై చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుయుక్తులను ఎండగట్టారు. అనంతరం బీసీ సంఘాల నేతలతో మాట్లాడారు.


ఆ తర్వాత సంగాలపల్లె శివారు వద్ద ఏర్పాటు చేసిన బసకు మధ్యాహ్నం 2.45 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు గంగిరెడ్డిపల్లెకు చేరుకున్నారు. అక్కడి నుంచి అయ్యవారిపల్లె మీదుగా ఉరుటూరు వరకు నడిచారు. అక్కడ రాత్రి బస చేశారు. జగన్‌ మూడోరోజు మొత్తం 16.2 కిలోమీటర్లు నడిచారు.  


ఇలాంటి కుళ్లు, కుతంత్రాలు, కుట్రలతో ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఎదిరించాను. ఎవ్వరికీ  భయపడలేదు. నీతిగా, నిజాయితీ గా రాజకీయాలు చేశాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు తప్పుచేశాడని ఎప్పుడూ అనిపించుకోలేదు. రాబోయే రోజుల్లో కూడా అలాగేనడుచుకుంటాను. తప్పుచేశాడని ఎప్పటికీ అనిపించుకోను. విశ్వసనీయతకు అర్థంలా నిలుస్తానని మనవి చేస్తున్నాను.

చంద్రబాబు జగన్ సవాల్ స్వీకరిస్తె ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పలుచన ఔతారుకదా! మరెందుకు ఆలస్యం? ఒకదెబ్బతో రాష్ట్రానికి పట్టిన ప్రతిపక్షమనే దరిద్రం వదలి పోతుందిగా? ప్రతిపక్షం అభివృద్దికి ఆటంకంగా ఉన్నవేళ అందివచ్చిన అవకాశం వాడేస్తే సరి. ఈ అవకాశం వినియోగించుకోకపోతే జగన్ చంద్రబాబు పై చేసిన ఆరోపణలు నిజమని అనుకోవాలిగదా! 



మరింత సమాచారం తెలుసుకోండి: