ఎవ్వరి మీదా ఎప్పుడూ లేని ప్రేమ సడన్ గా మజ్లిస్ వారికి తెరాస చీఫ్, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీద కారిపోతోంది. ఇప్పటికి ఇప్పుడు అసెంబ్లీ సెషన్ లలో భాగంగా తెరాస లాంటి పార్టీ లేదు కెసిఆర్ లాంటి నాయకుడు లేడు అంటూ మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఉపోద్ఘాతం వినిపించారు. గత సమావేశాలకి పూర్తి భిన్నంగా ఈ సారి ఆయన కెసిఆర్ మీద పొగడ్తల దండ పడేసారు.

ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి ని ఆకాశానికి ఎత్తేసిన ఆయన ఎప్పటెప్పటి విషయాలో గుర్తు తెచ్చుకుని మరీ ఈ భజన కార్యక్రమం మొదలు పెట్టారు. తెలంగాణా రాష్ట్ర సాధన దగ్గర నుంచీ అనేక ఉద్యమాలూ, సీఎం పదవి ఇలాంటి విషయాలు అన్నీ తీసుకొచ్చి మరీ పొగడి పడేసారు అక్బర్. సీఎం ప‌ద‌వికి మించిన స్థానం ఆయ‌న‌కి ద‌క్కాల‌ని ఒవైసీ ఆకాంక్షించారు.

తెలంగాణ ఇచ్చామ‌ని కొంత‌మంది చెప్పుకుంటున్నార‌నీ, అది అర్థం లేని వాద‌న అన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన ప‌రిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చార‌న్నారు. ఉద్య‌మంలో మేమూ క‌లిసి పోరాడామ‌ని కొంత‌మంది నేత‌లు చెప్పుకుంటున్నా, వారు కూడా క‌ల‌వాల్సిన ప‌రిస్థితికి కార‌ణం కేసీఆర్ అన్నారు. 2019 లో మజ్లిస్ తెరాస కలిసి ఖచ్చితంగా అధికారం లోకి వస్తాయి అని సవాల్ విసిరారు.

గతం లో లేనంతగా ఈ భజన కి కారణాలు ఉన్నాయి అంటున్నారు. వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తినే అంశాలైన సెప్టెంబ‌ర్ 17 లాంటివాటినే ప‌క్క‌న ప‌డేశారు. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రీ ఇవ్వ‌నంత ప్రాధాన్య‌త నిజాం న‌వాబుకు ఇస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మజ్లిస్ నేతలని సంప్రదించడం, మైనారిటీ లకి లబ్ది చేకూరే అంశాల మీద గట్టిగా ఉండడం కెసిఆర్ కి  కలిసొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: