సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృతమవుతోంది. ఈనెల నాలుగున ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి నిర్ణయించగా ఏపి ఎన్జీఓలు నిరవధిక సమ్మెకు నగారా మోగించారు. ఈనెల అయిదునుంచే మెరుపు సమ్మెకు దిగనున్నట్టు వారు ప్రకటించారు. మరో వైపు సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు సైత ఉద్యమబాట పట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. నిజానికి సీమాంధ్ర ఉద్యమం ఉత్తర కోస్తా కన్నా, దక్షిణ కోస్తా, రాయలసీమ లోనే ఎక్కువగా వుంది. మరో పక్క పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కూడా ఉద్యమం ఊపు అందుకోక పోవడానికి ఓ కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో మీడియాలో వస్తున్న

వార్తలు చూసయినా మిగిలిన ప్రాంతాలవారు ఉద్యమాన్ని అందుకునే అవకాశం వుంది. ఉద్యమ ఉధృతిపైనే నాయకుల ఆలోచనా విధానం ఆధారపడి వుందన్నది ఖాయం. ఏనిర్ణయమైనా అందరు కలిసి తీసుకోవాలని సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలనే ఆలోచనలో సీమాంధ్రమంత్రులు ఉండగా, వారి వెంటనే ఎమ్మెల్యేలు కూడా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు ఆలోచన. దీనికి సమైక్యాంధ్ర జేఏసి కార్యాచరణలో భాగంగా దశల వారీ భారీఆందోళన కార్యక్రమాలకు సిద్దం అయ్యారు.అయితే ఈ నిర్ణయాలన్నీ ప్రజల ఆగ్రహావేశాల పదునుపైనే ఆధారపడి వుంటాయి.

ఎన్నికల ముందు ప్రజల ముందుకు వెళ్లలేము అనుకుంటే తప్ప, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా బాట పట్టరు.వీలయినంత వరకు రాజీనామా చేయకుండానే వ్యవహారం నడిపించడానికి చూస్తారు. ప్రజాప్రతినిధుల వ్యవహారంపై ఇప్పటికే ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతోంది. అయితే అది ఏ మేరకు ఉధృతం అవుతుందన్నిది చూడాల్సి వుంది. ముఖ్యంగా వైకాపా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అందరికన్నా ముందుగా ఉద్యమాన్ని అందుకున్నది అదే కనుక. ఆ విధంగా మిగిలిన పార్టీలపై పైచేయి సాధించాలని చూస్తోంది. అదే కనుకు పురోగమన దిశలో సాగితే మిగిలిన పార్టీలు కూడా ఆ బాట పట్టక తప్పదు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లడం కష్టం కావచ్చు. కష్టం కాకున్నా వైకాపా నుంచి విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: