రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సవాయ్ మాధోపూర్ జిల్లా దుబేలో ఓ బస్సు వంతెన మీద నుంచి నదిలో పడిపోయింది.ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న ఓ బ‌స్సు అదుపు త‌ప్పి వంతెన పై నుంచి న‌దిలో ప‌డి పోవ‌డంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి కొంత మందికి గాయాల‌య్యాయి. స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయ‌ప‌డ్డ‌ వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందజేయిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది.

బ‌స్సు లాల్ సోత్ ప్రాంతం నుంచి స‌వాయ్‌ మాధోపూర్ వచ్చింద‌ని, ఆ బ‌స్సును న‌డిపే డ్రైవ‌ర్.. 16 ఏళ్ల కండ‌క్ట‌ర్‌ని డ్రైవ‌ర్ సీట్లో కూర్చోబెట్టి బ‌స్సు న‌డ‌ప‌మ‌ని చెప్పి ప‌డుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు.  రామ్ దేవర ఆలయాన్ని చూసేందుకు దౌసాలోని లాల్ సాట్ నుంచి భక్తులు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ కట్టర్లతో బస్సు కిటికీలను తొలగించి.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీశారు. మృతులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు లాగారు.  ప్రమాద స్థలికి జిల్లా కలెక్టర్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 2010, మార్చిలో సవాయ్ మాధోపూర్‌లోని మోరెల్ నదిలో బస్సు పడిపోవడంతో 26 మంది చనిపోయిన విషయం విదితమే.

 ఈ ప్ర‌మాదంలో ఆ కండ‌క్ట‌ర్, డ్రైవ‌ర్‌ కూడా మృతి చెందార‌ని పోలీసులు చెప్పారు. ఈ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు మొద‌లు పెట్టింద‌ని ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: