చలికాలపు పొగమంచు, ఆర్టీసీ బస్సు అతివేగమూ కలిసి ఐదుగురు విద్యార్థుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. గుంటూరు జిల్లాలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనగా, ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.గురువారం ఉదయం స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. వేగంతో వచ్చిన బస్సు ఒక్కసారిగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. 

గాయపడిన చిన్నారులను అత్యవసర చికిత్సకై 108 వాహనంలో స్థానికంగా ఉన్న జీజీహెచ్‌కు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ఈ ముగ్గురి పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న ఆటో కనిపించ లేదని ప్రాథమికంగా తెలుస్తున్నా, బస్సు వేగం ప్రమాద తీవ్రతను పెంచిందని సమాచారం.

ఈ ఘటనలో గాయత్రి, శైలజ, రేణుక, కార్తీక రెడ్డి, ధనరాజ్ లు మరణించారు. వీరిలో నలుగురు టెన్త్ చదువుతున్న విద్యార్థులు కాగా, ధనరాజ్ ఆటో డ్రైవర్. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్ సిబ్బంది గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది. కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రవాణా మంత్రి అచ్చెన్నాయుడు, గుంటూరు కలెక్టర్ తో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: