బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంపై దృష్టిసారించింది. రాష్ట్ర శాఖలో కీలక మార్పులు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎవరిని అధ్యక్షునిగా నియమించాలనేదానిపై ఒక క్లారిటీకొచ్చిన అమిత్ షా.. మరికొద్దిరోజుల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. కేవలం రాష్ట్ర అధ్యక్షుడి మార్పే కాదు..వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని... మరిన్ని సంస్కరణలు చేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం నడుంబిగించింది..

Image result for ap bjp

బీజేపీ రాష్ట్ర శాఖకు మరికొద్ది రోజుల్లో కొత్త అధ్యక్షుని నియామకానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది...రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో మార్పులు, చేర్పులపై అమిత్ షా దృష్టిసారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో అధికారికంగా రెండు గ్రూపులు నడుస్తుండగా.. అనధికారికంగా మరికొన్ని గ్రూపులు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి కొందరు కమలదళం నేతలు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. మరికొందరు టీడీపీ అనుసరిస్తున్న తీరుపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు.

Image result for ap bjp

రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ఏపీ శాఖకు విశాఖకు చెందిన కంబంపాటి హరిబాబును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. మొదట్లో బాగానే ఉన్నా 2014 ఎన్నికల అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, టీడీపీ కలసి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు. అనుకూల వర్గానికి హరిబాబు నాయకత్వం వహిస్తుండగా.. వ్యతిరేకవర్గానికి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు నాయకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరు చేస్తున్న ప్రకటనలు..వ్యవహరిస్తున్న తీరు అధినాయకత్వానికి మింగుడుపడటంలేదు.. రాష్ట్రానికి చెందిన నేతలు ఒకరిపై ఒకరు అమిత్ షాకు ఫిర్యాదులు చేస్తుండటంతో ఎవరి తీరును తప్పుబట్టాలి.. ఎవరి వెర్షన్ కరెక్టో తెలియక అమిత్ షా సైతం జుట్టు పీక్కుంటున్న పరిస్థితి నెలకొంది.

Image result for ap bjp

ఈ దశలో ఏపీ వ్యవహరాలను పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రానికే చెందిన బీజేపీ కీలక నేత రాంమాధవ్ తో పాటు.. మొన్నటి వరకు వెంకయ్యనాయుడు ఓఎస్ డిగా ఉన్న సత్యకుమార్ కు అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. వారిద్దరు గత కొన్ని రోజులుగా ఆర్ ఎస్ ఎస్ కు చెందిన కీలక నేతలతో పాటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలను పరిశీలించి పరిస్థితులను అమిత్ షాకు తెలిపినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు చేయాలని కేంద్ర నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Image result for ap bjp

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ ఐదు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో సోము వీర్రాజుతో పాటు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, రాయలసీమకు చెందిన నరసింహరెడ్డితో పాటు యువనేత పీవీఎన్ మాధవ్ పేర్లను పరిశీలించింది. అయితే కుల సమీకరణల దృష్ట్యా  కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని అధ్యక్షుడిగా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో ఆవర్గం వారి ఓట్లను పొందే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

Image result for ap bjp

ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలకు సామాజిక వర్గాలవారీ ఓటు బ్యాంకు ఉండటంతో ఇతర సామాజిక వర్గాల ఓట్లను తమవైపు మల్చుకోవాలంటే ఈ రెండు వర్గాలకు కాకుండా అధ్యక్షుడిని నియమించాలని ఓనిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుల్లో ఒకరిని నియమించే ఛాన్సెస్ ఎక్కువుగా కనబడుతున్నాయి. సోము వీర్రాజు విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్ ల్లో పనిచేయడంతో పాటు.. సంఘ్ నేతల  మద్దతు ఉంది. కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి ఆర్ ఎస్ ఎస్ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా మాత్రం సోము వీర్రాజు వైపే సంఘ్ నేతలు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. హరిబాబు పనితీరుపై ఆర్.ఎస్.ఎస్ కీలక నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

Image result for ap bjp

ప్రస్తుతం సంఘ్ పరివార్ సంస్థల కీలక సమావేశం ఉజ్జయినిలో జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈసమావేశానికి అమిత్ షాతో పాటు కీలక బీజేపీ నేతలు హాజరుకానున్నారు. ఏపీకి చెందిన ఆర్.ఎస్.ఎస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈసమావేశాల్లో సమీక్ష అనంతరం పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్పు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ ఎవరినీ అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Image result for ap bjp

అలాగే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికీ స్థానం కల్పించలేదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా హరిబాబు సహాయ మంత్రి హోదా దక్కుతుందని భావించినప్పటికీ చివరి క్షణంలో పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఒకరిని కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోవాలని కూడా యోచిస్తోంది. దీనిలో భాగంగా 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరిని గుజరాత్ లేదా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిగా అవకాశమివ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోంది. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉండటం ఆమెకు కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది.

మొత్తం మీద బీజేపీ రాష్ట్ర శాఖలో మార్పులు ఖాయం కాగా..అవి ఏస్థాయిలో ఉంటాయనేది తెలియాల్సి ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పును బట్టి 2019లో బీజేపీ ఏవిధంగా వ్యవహరించనుందో తెలియనుంది. టీడీపీ వ్యతిరేక వర్గానికి చెందిన వ్యక్తికి పదవినిస్తే  మిత్ర పక్షంతో కటీఫ్ చెప్పకనే చెప్పినట్లువుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏం జరుగుతుందనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది


మరింత సమాచారం తెలుసుకోండి: