సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రుల‌పై విమ‌ర్శ‌లు త‌గ్గ‌డం లేదు. ఆశించిన స్థాయిలో ప‌నితీరు లేక కొంద‌రు.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ మ‌రికొంద‌రు.. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో మ‌రికొంద‌రు.. ఇలా మంత్రులంద‌రూ నిత్యం ఏదో ఒక ఆరోప‌ణ ఎదుర్కొంటున్నారు! ఎన్నిసార్లు కేబినెట్‌ విస్త‌రించినా.. మ‌నుషులు మారుతున్నారు త‌ప్ప విమ‌ర్శ‌లు మాత్రం త‌గ్గ‌డం లేదు. పైగా సొంత పార్టీ నేత‌లే తిరుగుబాటు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం! ఇన్ని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి వ‌ర్గంతో వ‌చ్చే ఎన్నికల‌కు వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని గ్ర‌హించిన సీఎం చంద్ర‌బాబు.. ప్రక్షాళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈసారి కేబినెట్‌లో భారీ మార్పులు త‌ప్ప‌వ‌ని, సుమారు ఐదు నుంచి ఆరుగురు కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని స‌మాచారం!

Image result for andhrapradesh

ఆశించిన స్థాయిలో ఏపీ మంత్రులెవ‌రూ ప‌నిచేయ‌డం లేద‌నే విమ‌ర్శ కొంత కాలం నుంచి వినిపిస్తూనే ఉంది. చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌ర్వేల్లోనూ మంత్రుల ప‌నితీరు ఏమాత్రం బాగోలోద‌నే నివేదిక‌లు వ‌స్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఆయ‌నే స్వ‌యంగా ఈ విషయాన్ని స‌మావేశాల్లోనూ చెబుతూ వ‌స్తున్నారు. ఇన్నాళ్లూ ఎలాగొలా నెట్టుకుంటూ వ‌చ్చినా.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనూ మంత్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు మిన‌హా మిగిలిన వాళ్లు నామ‌మాత్రంగానే మంత్రులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే ముస్లిం, గిరిజ‌న వ‌ర్గాలకు కేబినెట్‌లో ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ఆయా వ‌ర్గాలు తీవ్ర‌ అసంతృప్తితో ఉన్నాయి. 

Image result for tdp

ఒక‌ప‌క్క ప్ర‌జ‌ల్లో, మ‌రోప‌క్క ముస్లిం, ఇత‌ర వ‌ర్గాల్లో అసంతృప్తిని గ‌మ‌నించిన టీడీపీ అధినేత.. ఇప్పుడు మ‌రోసారి కేబినెట్‌లో మార్పులుచేర్పులు చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌ధానంగా ఈ ఏడాది మూడు రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో రెండు టీడీపీకి ద‌క్క‌బోతున్నాయి. ఇందులో ఒక స్థానానికి ప్ర‌స్తుత ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని ఎంపిక చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే జ‌రిగితే కొత్తగా ఆస్థానంలో వేరొకరిని నియ‌మించాలి. దీంతో పాటు మ‌రికొంద‌రి శాఖ‌లు మార్చ‌డంతో పాటు.. కొత్త‌వారిని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. మార్చి నాటికి దీనికి ఒక తుది రూపు కూడా రాబోతోంద‌ని తెలుస్తోంది. 
Image result for tdp cabinet
ప‌నితీరు స‌రిగా లేద‌ని భావిస్తున్న మంత్రుల్లో ప్ర‌కాశం, కృష్ణా, ప‌శ్చిమ‌గోదావ‌రి, క‌ర్నూలు జిల్లాల‌కు చెందిన వారు ఉన్నార‌ని, వీరిపై వేటు త‌ప్ప‌ద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల వారిని కూడా కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం గిరిజ‌నులు, మైనారిటీ వ‌ర్గాలకు చెందిన వారెవ‌రికీ మంత్రి టికెట్ ద‌క్క‌లేదు. ఈ అసంతృప్తి ఆయా వ‌ర్గాల్లో తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో కొత్త ముఖాలు క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. గత ఏప్రిల్ 2న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో టీడీపీలో జ‌రిగిన ర‌చ్చ ముందెన్న‌డూ చూడ‌నేలేదు.


బాబు తీరుపై అప్ప‌టి మంత్రి బొజ్జ‌ల వంటి సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అంతేగాక మంత్రి బెర్త్ ఆశించిన బోండా ఉమ‌.. కాపులకు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఆవేద‌న చెంద‌గా, చింత‌మనేని ప్ర‌భాక‌ర్ వంటి వారు.. సొంత పార్టీనే పెట్టుకుంటా అంటూ తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. వీరిని బుజ్జ‌గించి స‌ముదాయించారు. మ‌రోసారి మంత్రి వర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే ఇలాంటి అస‌మ్మతి చెల‌రేగడం ఖాయం. ఇది తీవ్ర ప‌రిణామాల‌కు దారితీసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. మ‌రి వీట‌న్నింటినీ ఆలోచించి.. మ‌రోసారి సాహసోపేత నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు తీసుకుంటారో లేదో!! 



మరింత సమాచారం తెలుసుకోండి: