గత కొంత కాలంగా  శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంటే..మృత్యుద్వారంగా భావిస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వం ఇక్కడ ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెస్తున్నా..కొంత మంది నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  ఇక ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదం జరిగింది అంటే దాదాపు ఏ ఒక్క ప్రాణం మిగలదన్న పరిస్థికి చేరింది.  తాజాగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం సంభవించింది.

బూర్జుగడ్డ వద్ద మంగళవారం తెల్లవారుజామున  కారు బోల్తా కొట్టిన ఘటనలో అనన్య అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నిఖిత, నితిన్‌లను ఆసుపత్రికి తరలించారు.  మృతురాలు అనన్య ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన అమ్మాయిగా భావిస్తున్నారు.   హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదువుతోన్న అనన్య తన స్నేహితులతో కలిసి హ్యుందాయ్‌ ఐ20 కారు(టీఎస్‌ 09 ఈఎస్‌ 5257)లో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్‌ నుంచి షాద్‌నగర్‌ వైపునకు వెళ్లే క్రమంలో బూర్జుగడ్డ వద్ద కారు బోల్తా కొట్టింది.
Ananya
కారు అమాంతం ఎగిరిపడటంతో తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారు వేగమే కారణమని భావిస్తున్నారు.విద్యార్థిని మరణవార్తతో హెచ్‌సీయూలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి కుటుంబీకులకు సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు తెలిపారు.  ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: