గుజరాత్ లో జరిగిన ఎన్నికల లో  భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఉత్తర భారతంలో బలంగా ఉన్న బిజెపి దక్షిణ భారతదేశంలో దూసుకుపోవాలని పదునైన ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బిజెపి నాయకులు ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు ఉంది. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే వర్గం, మరొకటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను విమర్శించే వర్గం.

ఇలా రెండు వర్గాలు గా బిజెపి ఏర్పడి రాష్ట్ర రాజకీయాల్లో బలంగా నాటుకు పోవాలని రాష్ట్రానికి సంబంధించిన బిజెపి నాయకులు తమ నోటికి పని పెడుతున్నారు. ఇందులో తొలిది చంద్రబాబు వ్యతిరేక వర్గం. ఇందులోని ఎంఎల్సీ సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు బృందం మొదటి నుండి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న విషయం అందరూ చూస్తున్నదే.

సోము వీర్రాజు అయితే చంద్రబాబునాయుడు పేరు చెప్తే అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరెగిరి పడుతున్నాడు. తాజాగా ఈయన కి తోడుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు జతకట్టారు...మొన్నీమధ్య తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు, సవాలు విసిరారు మంత్రి మాణిక్యాలరావు.

ఇంక రెండో వర్గం ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను టార్గెట్ చేస్తూ విశాఖపట్నం ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు వరుసపెట్టి గవర్నర్ పై ఆరోపణలు చేస్తున్నారు. గవర్నర్ తెలంగాణా ప్రభుత్వం తరపునే మాట్లాడుతున్నట్లు మండిపడుతున్నారు. నరసింహన్ వైఖరి మార్చుకోకపోతే కేంద్రానికే ఫిర్యాదు చేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా మాకు కొత్త గవర్నర్ కావాలంటూ  కొత్త రాగం మొదలుపెట్టారు..ఇలా రాష్ట్రానికి సంబంధించిన బిజెపి నాయకులు రెండు వర్గాలుగా చీలి  రాష్ట్రంలో బిజెపి పార్టీ ని బలపరచాలని వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: