చంద్రబాబు పరిపానలలోని అసమర్థతను, లోపాలను బట్టబయలు చేస్తూ,తన మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతిపక్ష నేత, వైఎసార్సీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ నెల 6వ తేదీన కడప జిల్లా, ఇడుపులపాయ నుండి ప్రారంభమయిన ఈ పాదయాత్ర తిరిగి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియనుంది. ఆరునెలల పాటు జరిగే ఈ పాదయాత్రలో జగన్ మొత్తం 3000 కిలోమీటర్ల పరిధిలో ఉండే 125 అసెంబ్లీ స్థానాల్లో తన ప్రచారాన్ని నిర్వహించనున్నాడు. అయితే మిగిలిన 50 అసెంబ్లీ స్థానాలలో బస్సుయాత్ర ద్వారా తన   ప్రచారపర్వాన్ని కొనసాగించనున్నాడు.

కాగా తన పాదయాత్రలల్లో నిర్వహించే ప్రసంగాలలో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. అధికారపక్షనాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుకొని ఆఖరికి సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకు తనను విమర్శించేవాళ్లను తన ప్రసంగాలలో పదునైన మాటలతో విమర్శలు గుప్పిస్తున్నాడు. రాజకీయ నాయకుల మద్య విమర్శలు పరిపాటి. అయితే అవి ఎప్పుడూ ఒక హద్దుకు లోబడి ఉంటాయి. కానీ ఒకొక్కసారి రాజకీయనాయకులు చేసే విమర్శలు వివాదాలను సృష్టిస్తాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. అభిమానులు ఎవరైనా దగ్గరికి వస్తే వారితో కరచాలనాలు చేయడం,ఫొటోలు దిగడం, ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం వంటివి సెలెబ్రిటీ హోదాలో ఉన్నవాళ్లు అభిమానులను సంతోష పెట్టడం కోసం చేసే పనులు. ఇందుకు జగన్ మాత్రం మినహాయింపు కాదు. అయితే తనను కలిసే వృద్ధ మహిళలను ఆత్మీయంగా ముద్దాడటం జగన్ కు అలవాటు. అయితే ఈ చర్యను సూచిస్తూ మంత్రి జవహర్,జగన్ చేస్తున్నది పాదయాత్ర కాదు ముద్దుల యాత్ర అని వాఖ్యానించి దుమారమే లేపాడు.


మంత్రి వాఖ్యలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అర్థంలేని మాటలుగా వర్ణిస్తున్నారు. విమర్శలపై స్పందించిన కడప శాసనసభా సభ్యుడు అంజద్ భాషా  అసలు మంత్రి జవహర్ కు తల్లికి,చెల్లికి తేడా తెలియదేమో అని ఎద్దేవాచేశారు. కడపలోగల వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీరును హెల్త్ డ్రింక్ గా వర్ణించిన ఆ మంత్రినా ఈ మాటలు అంటున్నదని ఆయన హేళన చేశారు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉండటం మన దురదృష్టం అని ఆయన పేర్కొన్నాడు. బాబు హయాంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని రాబోవు 2019 ఎన్నికలలో జగన్ గెలిచి ప్రజల కష్టాలను తీరుస్తాడని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: