చిన్న చిన్న పనులకే హడావుడి చేసే నెల్లూరు మేయర్ అజీజ్ గత వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఆర్ధిక నేరాలు, ఛీటింగ్  ఆరోపణలు చుట్టుముట్టడంతో  అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడీ అంశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల విచారణ నేపధ్యంలో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం మేయర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Image result for nellore mayor

రాజకీయాలకంటే ముందు నుంచి నెల్లూరు నగర మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ వ్యాపార రంగంలో ప్రసిద్దుడు. స్టార్‌ ఆక్వా పేరిట రొయ్యల దిగుమతి, ఎగుమతి చేస్తూ... ఇతర వ్యాపారాల్లో సైతం బిజీగా ఉండేవాడు. ఇదే సమయంలో వైఎస్సార్‌ మరణం తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్దితుల నేపధ్యంలో  వైసీపీలోకి అడుగుపెట్టిన అజీజ్‌.. ప్రత్యర్ధి వర్గాలకు పోటీగా ఎదిగి మేయర్‌గా గెలిచాడు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో టీడీపీకి దగ్గరై సైకిల్‌ ఎక్కేశాడు. అయితే ఇటీవల అజీజ్ పై ఆర్ధిక నేరాల కేసు నమోదవడం సంచలనం రేపుతోంది.

Image result for nellore mayor

మేయర్ అజీజ్, అతని సోదరుడు జలీల్ కుటుంబానికి చెందిన స్టార్ ఆక్వా కంపెనీతో చెన్నైకి చెందిన ప్రసాద్ జింపెక్స్ సంస్ధకు వ్యాపార భాగస్వామ్యం ఉంది. ఇందులో భాగంగా ప్రసాద్ జింపెక్స్ సంస్ధ విడతలవారీగా ఇప్పటి వరకూ 42 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది.. కొంతకాలం అన్నీ సక్రమంగానే సాగి వ్యాపారం బాగానే జరిగింది. అయితే వందల కోట్లలో వ్యాపారం జరిగినా తాము పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడం, వచ్చిన డబ్బునంతా మేయర్ కు చెందిన కంపెనీ తమ ఖాతాల్లో వేసుకుంటూ ఉండటంతో ప్రసాద్ జింపెక్స్ సంస్ధ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. దీంతో లెక్కలు చూపాలంటూ స్టార్ ఆక్వా యాజమాన్యాన్ని జింపెక్స్‌ సంస్ధ ప్రశ్నించింది.  తాము లెక్కలు అడిగితే చూపకుండా తమను బెదిరించారంటూ  జింపెక్స్‌ కంపెనీ యాజమాన్యం చెన్నై పోలీసు కమిషనరేట్ లో గత ఏడాది డిసెంబర్‌ 30న ఫిర్యాదు చేసింది. చీటింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అజీజ్ తోపాటు సోదరుడైన కార్పోరేటర్ జలీల్ మరో ఏడు మందిపై కేసు నమోదు చేశారు.

Image result for nellore mayor

అజీజ్ తో వ్యాపార లావాదేవీలు చేసి మోసపోయిన ప్రసాద్ జింపెక్స్ సంస్ధ చెన్నైలోని ప్రసిధ్ది చెందిన ఆనంద్ సినీ సర్వీసెస్ కు సంబంధించిన జెమినీ గ్రూప్ లో అంతర్భాగం కావడంతో కేసులో తీవ్రత పెరిగింది. తాము పెట్టుబడి పెట్టిన మొత్తంతో పాటు వ్యాపారంలో లాభాలను తమ ఖాతాల్లోనే వేసుకొని వాడుకోవడం, ప్రశ్నించిన తమ ఉద్యోగులను బెదరించడాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు స్టార్ ఆక్వా అంతర్జాతీయంగా చేసిన వ్యాపార లావాదేవీల్లో జరిగిన అవకతవకల గురించి సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. ఇందులో వ్యాపారంలో వచ్చిన డబ్బును విదేశాల్లో ఉన్న తమ ఇతర సంస్ధలకు మళ్లించారంటూ ఆరోపిస్తూ పలు ఆధారాలను వెల్లడించింది. ప్రసాద్ జింపెక్స్ సంస్ధ  తన ప్రయత్నాలు తాను చూస్తుండగానే అజ్ఞాతంలో ఉన్న అజీజ్  ముందస్తు బెయిల్‌కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో రాజకీయంగా  మేయర్ స్ధానంపై కన్నేసిన వైసీపీ డిప్యూటి మేయర్‌ ద్వారా పావులు కదుపుతోంది.

Image result for abdul aziz nellore

ఇక టీడీపీలోని అజీజ్ వ్యతిరేకులు కూడా ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో జిల్లాకే చెందిన వాకాటి నారాయణరెడ్డిపై ఇలాంటి వ్యాపార లావాదేవీల కేసు నమోదవడం, బ్యాంకులకు నగదు చెల్లింపు వ్యవహారాల్లో తేడాలు రావడంతో అప్పట్లో టీడీపీ  అధిష్టానం వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మేయర్‌ అజీజ్ పై ఇలాంటి కేసే నమోదవడంతో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా ప్రతిపక్ష వైసీపీ మాత్రం జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: