అవును! కొంత నిష్టూరంగా అనిపించినా.. విజ‌య‌వాడ‌లో వైసీపీ ప‌త‌మైపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు వంగ‌వీటి రాధా రూపంలో మిణుకుమిణుకు మంటూ మెరిసిన ఆ ఒక్క దీపం కూడా ఇప్పుడు టీడీపీ గూటికి చేరిపోతుండ‌డంతో  విజ‌య‌వాడ వైసీపీలో అంధ‌కారం రాజ్య‌మేల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. విజ‌య‌వాడ‌లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నారు. తూర్పు, సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ‌. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ గ‌త ఎన్నిక‌ల నాటికి వైసీపీకి రెండు చోట్ల మాత్ర‌మే బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. తూర్పున వంగ‌వీటి రాధా కృష్ణ‌, ప‌శ్చిమాన జ‌లీల్‌ఖాన్‌లు అత్యంత బ‌ల‌మైన నేత‌లుగా వైసీపీకి ల‌భించారు. ఇక‌, సెంట్ర‌ల్‌లో వైసీపీకి ఆది నుంచి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉన్నా.. బ‌ల‌మైన నేత మాత్రం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

Related image

ఇక‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన జ‌లీల్ ఖాన్‌.. అనంత‌రం టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు ప్ర‌యోగించిన ఆక‌ర్ష్ మంత్రంతో జ‌గ‌న్‌కు బై చెప్పి టీడీపీ సైకిల్ ఎక్కేశారు. దీంతో ఇక్క‌డ వైసీపీకి ప్రాతినిధ్యం వ‌హించే నేత క‌రువ‌య్యాడు. అయితే, కొన్నాళ్ల త‌ర్వాత.. స్థానిక బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీనివాస్‌కు బ‌లం అంతంత మాత్ర‌మే. ఈయ‌న‌కు ప్ర‌జాద‌రణ కూడా అంతంత మాత్ర‌మే. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆశించిన మేర‌కు వైసీపీ దూసుకుపోయిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇక‌, మ‌రోప్ర‌త్యామ్నాయం లేక జ‌నాలు టీడీపీనే ఆద‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

Image result for ysrcp

ఇక‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌, వైసీపీ నేత‌గా ఉన్న వంగ‌వీటి రాధా కృష్ణ ఇప్ప‌టి వ‌ర‌కు చ‌క్రం తిప్పారు. ఇక్కడ ప్ర‌తి ప్రాంతంలోనూ రంగా అభిమానులు ఉండ‌డం, వైసీపీకి అనుకూలంగా మారింది. రంగా కొడుకు అనే ముద్ర కూడా వైసీపీకి బ‌లాన్ని చేకూర్చించింది. దీంతో ఇక్క డ వైసీపీకి ఆద‌ర‌ణ ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పొచ్చు. అయితే, ఇప్పుడు రాధా పార్టీ మారుతున్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఇక్క‌డ వైసీపీ జెండాను మోసే వారు క‌నుచూపు మేర‌లో ఏ ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. ఇక‌, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం సెంట్ర‌ల్‌. ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన వాణిని వినిపించే నేత‌కానీ, పార్టీకి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే నేత కానీ కంటికి క‌నిపించ‌డం లేదు. 

Image result for vangaveeti radha

గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా లాయ‌ర్ పూనూరు గౌతం రెడ్డి పోటీ చేసినా.. ప్ర‌జ‌ల్లో అభిమానాన్ని సంపాయించ‌లేక‌పోయారు. క‌మ్యూనిస్టుగా ముద్ర‌ప‌డ‌డం, సిటీ కేబుల్ ఎండీగా ఉండ‌డం వంటి కార‌ణంగా జ‌నాలు ఆయ‌న‌ను ఇప్ప‌టికీ రాజ‌కీయ నేత‌గా స్వీక‌రించేందుకు అంగీక‌రించ‌లేక‌పోతున్నారు. దీంతో వైసీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన నేత లేడ‌నే చెప్పాలి. ఇక‌, గౌతం రెడ్డి ఆర్థికంగా కూడా నాలుగో స్థానంలోనే ఉన్నారు. దీంతో కేడ‌ర్‌ను పెంచుకునే స్థోమ‌త కూడా ఆయ‌న‌కు లేద‌నే చెప్పాలి. ఇలా ఏవిధంగా చూసినా.. విజ‌య‌వాడ‌లో వైసీపీకి తీవ్ర‌మైన ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: