సాక్షి.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అతి పెద్ద సర్క్యులేషన్ ఉన్న పత్రిక.. ఈ సంగతి అందరికీ తెలుసు. ఇది స్వయంగా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ యజమానిగా ఉన్న పత్రిక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అంతే కాదు.. జగన్ అధికారం కోసం దాదాపు ఎనిమిదేళ్లుగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. 2012 ఎన్నికల్లో విజయం చేతివరకూ అందివచ్చినట్టే వచ్చి జారిపోయింది కూడా. కేవలం ఒకటి రెండు శాతం ఓట్లతో అధికారం దూరమైంది. 


ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితి అంత సానుకూలంగా ఏమీ కనిపించడం లేదు. చంద్రబాబు ఆర్థిక, అంగ బలంతో వైసీపీ నేతలను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. ఆర్థికంగా బాగా పుంజుకున్న తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కు అవకాశం ఇవ్వకూడదని కృత నిశ్చయంతో ఉంది. ఇలా అన్నివైపుల నుంచి వైఎస్ జగన్ ను కష్టాలు చుట్టుముట్టినట్టి కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూర్తిగా అండగా నిలవాల్సిన సొంత పత్రిక కూడా అంత పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. 



ఎందుకంటే.. గురువారం రిపబ్లిక్ టీవీ ఓ సంచలన సర్వే ప్రకటించింది. దేశవ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఏ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై సర్వే నిర్వహించి ఫలితాలు ప్రకటించింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని రిపబ్లిక్‌ టీవీ, సీ–వోటర్‌ సర్వే తేల్చి చెప్పింది. మొత్తం 543 స్థానాల్లో 335 సీట్లను ఈ కూటమి చేజిక్కించుకుంటుందని తెలిపింది. జాతీయ స్థాయి సంగతి పక్కకు పెడితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి, అధికార టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ సర్వే తేల్చిచెప్పింది. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 13 చోట్ల విజయం సాధిస్తుందని.. చెప్పింది. గతంలో కంటే వైఎస్సార్‌సీపీ అదనంగా ఐదు స్థానాలు గెలుచుకుంటుందని చెప్పింది. 


నిజంగా ఇది వైసీపీకి చాలా అనుకూలమైన వార్త. వైసీపీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపే వార్త.. దీన్ని కూడా సాక్షి ఘనంగా ప్రజంట్ చేసుకోలేకపోయింది. వార్త లీడ్ కానీ.. లోపల విషయం కానీ.. వైసీపీని హైలెట్ చేస్తూ కవర్ చేయలేకపోయింది సాక్షి పత్రిక. అన్ని పార్టీలతో కలిపి వార్త రాసేసి.. దానికి మళ్లీ మోదీయే బాద్ షా అంటూ టైటిల్ పెట్టి చేతులు దులుపుకున్నారు అక్కడి విలేఖరులు. సొంత పార్టీకి అనుకూల వార్తను కూడా సరిగ్గా ప్రజంట్ చేసే పరిస్థితి లేకపోతే.. ముందు ముందు ఎన్నికల సమయంలో సాక్షి జగన్ కు ఎలా అండగా నిలబడుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: