రాబోవు 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల వ్యూహంలో భాగంగా జగన్ ప్రజాసంకల్ప యాత్ర అనే పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2017 నవంబర్ నెలలో జగన్ సొంత జిల్లా కడప,ఇడుపులపాయ నుండి ప్రారంభమయిన ఈ యాత్ర 90 రోజుల పాటు కొనసాగి చివరిగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం ప్రాంతంలో ముగియనుంది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ,తమ పార్టీ అజెండాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి జగన్ చెమటోడుస్తున్నాడు.


తన ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం 66 రోజుకు చేరుకుంది. అయితే ఈ రోజు పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్ ప్రసంగించాల్సిన వేదిక ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వివరాల్లోకి వెళితే ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ శ్రీకాళహస్తి చేరుకున్నారు. ఆయన ప్రసంగించడానికి ఒక వేదికను కూడా ఏర్పాటుచేశారు. కాగా వైసీపీ కార్యకర్తలందరూ ఒక్కసారిగా వేదిక పైకి వచ్చేయడంతో, ఆ బరువును తాళలేక  వేదిక కుప్పకూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ జగన్ అప్పటికింకా వేదిక వద్దకు  చేరుకోలేదు. దీంతో జగన్ కు పెద్ద గండమే తప్పింది.


కాగా ఈ ఘటనతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు  గాయాలపాలయ్యారు. హుటాహుటిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఇద్దరికీ  చికిత్స అందిస్తున్నారు. స్టేజీ కూలినప్పటికీ పెద్దగా ప్రమాదం వాటిల్లకపోవడంతో నిర్వాహకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న జగన్ విచారం వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని, పాదయాత్రలో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకూడదని, జాగ్రత్తగా ఉండాలని జగన్ కార్యకర్తలకు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: