పవన్ కల్యాణ్ ప్రజా యాత్రకు బయలుదేరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం అప్రతిహతంగా యాత్ర ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన పవన్ .. హైదరాబాద్ లోని నివాసం నుంచి అభిమానుల ఆశీర్వాదం మధ్య కొండగట్టు బయలుదేరారు. ఇలవేల్పు ఆంజనేయస్వామి ఆశీర్వాదం అనంతరం యాత్ర ప్రారంభిస్తారు.


పవన్ కల్యాణ్ కు ఆయన సతీమణి లెజినోవా వీరతిలకం దిద్ది రాజకీయ యాత్రకు పంపించారు. ప్రశాసన్ నగర్ లోని జనసేన కార్యాలయంలో ఉదయం 9 గంటల తర్వాత సతీమణి అన్నా లెజినోవా పవన్ కల్యాణ్ కు వీరతిలకం దిద్ది హారతి ఇచ్చారు. అనంతరం పవన్ యాత్రకు బయలుదేరారు. సుమారు 50కి పైగా వాహనాల్లో ఆయన అభిమానులు కొండగట్టుకు బయలుదేరారు.


మధ్యాహ్నం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం ఆయన యాత్ర ప్రారంభిస్తారు. రాత్రికి కరీంనగర్ లో జనసేన పార్టీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ రాత్రికి పవన్ కల్యాణ్ కరీంనగర్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం రేపు రాత్రికి కొత్తగూడెం చేరుకుంటారు. ఎల్లుండి ఖమ్మం చేరుకుని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.


పవన్ కల్యాణ్ యాత్ర ఈసారి విభిన్నంగా ఉంటుందని అందరూ ఊహించారు. కొండగట్టు నుంచి అప్రతిహతంగా యాత్ర కొనసాగుతుందని చెప్పడంతో ఎలా ఉంటుందోనని ఆశగా ఎదురు చూశారు. అయితే గతంలో ఆయన చేసిన యాత్రల్లాగే ఇది కూడా ఉండబోతోందని అర్థమైంది. గతంలో రెండు, జిల్లాల కార్యకర్తలతో పవన్ భేటీ అయి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. దీంతో కొత్తదనం ఏదీ లేకుండాపోయింది. అయితే తెలంగాణలో జనసేనాని యాత్ర చేయడం ఇదే తొలిసారి.


అయితే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత తన యాత్రకు సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. దీంతో.. ఆయన ఏం చెప్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. బస్సు యాత్ర చేయబోవట్లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే పాదయాత్ర కూడా ఉండదన్నారు. ప్రజలతో మమేకం అయ్యేలా యాత్ర ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: