వచ్చే సంవత్సరం జరుగబోయే ఎన్నికలకు దేశంలోని అన్ని రాజకీయపార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. పదునైన వ్యూహాలు రచించి ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలనే ఆలోచనల్లో ఉన్నాయి. అధికార పక్షాలు తాము అభివృద్ధి చేసిన పనులను, ప్రవేశపెట్టిన కొత్త పథకాలను, సంస్కరణలను  మాత్రమే జనాలలో పాకిపోయేలా చేసి ఓటర్లను ఆకర్షించాలని పరితపించగా, ఇక ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, రాబోయే ఎన్నికలలో అజెండాను ప్రజలకు వివరిస్తూ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నాయి.


దేశం మొత్తం మీద ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలు ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ హవా నడుస్తుంది. బీజేపేతర రాష్ట్రాలలో అక్కడక్కడా బీజేపీ కి కంచుకోటలు ఉన్నాయి, కానీ ఆంధ్రాలో ఇది పూర్తి భిన్నం. కనీస స్థానాలలో అయినా సీట్లు గెలుచుకొని మెల్లమెలాగా ఆంధ్రాలో పాగా వేయాలని బీజేపీ భావిస్తుంది. అందుకు తగ్గట్టు పావులు కూడా కదుపుతుంది. గత ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే.


అయితే 2019 ఎన్నికలలో ఈ పొత్తు కనిపించేలా లేదు. అందుకు తగ్గ కారణాలు కూడా లేకపోలేదు. ఇక బీజేపీ వైపునుండి చూస్తే గత ఎన్నికలలో తాము ఆశించినంత స్థానాలను టీడీపీ ఇవ్వలేదు అని బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇక టీడీపీ శ్రేణులు కూడా కుంటిసాకులు చెప్పడం ప్రారంభించారంట! మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని నెలలైనా పీఎం అపాయింట్మెంట్ ఇవ్వనేలేదు, అయినా మీరు మాతో పొత్తు  పెట్టుకోకపోతే కలిగే నష్టమేమీ లేదు, అన్ని స్థానాలలో ఒంటరిగా పొటీ చేసి గెలిచే సత్తా మాకుంది అని వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటున్నారు అని చర్చ జరుగుతుంది.


ఇద్దరు పరస్పర విమర్శలకు దిగుతుంటే అనూహ్యంగా జగన్ సీన్లోకి వచ్చాడు. రాష్ట్రపతి ఎన్నికలముందు టీడీపీ అధినేతకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగన్ కు పీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం అప్పట్లో టీడీపీ నేతలను ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై బాహాటంగానే విమర్శలు సంధించారు టీడీపీ నేతలు. ఈ భేటీ వెనక కారణాలు ఏముంటాయని అప్పట్లో తీవ్ర చర్చలు కూడా జరిగాయి. కాగా రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


ఇప్పుడు జగన్ మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచనలకు గురిచేస్తున్నాయి. ఒక జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్ మాట్లాడుతూ మా పార్టీ బీజేపీ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్దంగా ఉంది, పొత్తు పెట్టుకోవడంలో మాకెటువంటి అభ్యంతరంలేదు, కాకపోతే ఆంధ్రకు ప్రత్యేకహోదా కల్పించాలి. అప్పుడయితేనే మరో మాటలేకుండా స్వతంత్రంగా మేమే పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తాం అని ఆయన తెలిపారు. జగన్ మాటలని బట్టి చూస్తే బీజేపీ తో చేతులు కలిపేందుకు సిద్ధమేనని తెలుస్తుంది. ఒక వేళ అదే జరిగితే టీడీపీ కి కష్టకాలం తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: