ఒకటి.. రెండు.. మూడు.. పది.. యాభై.. వంద.. ఇదేదో కార్పొరేట్‌ కాలేజీల ర్యాంకుల ప్రకటన కాదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో.. నింగికి పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య. అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం.. మనం ప్రపంచం వైపు చూశాం. ఇప్పుడు.. ప్రపంచమే మన వైపు చూస్తోంది. అదీ ఇస్రో సాధించిన ఘనత. ఇస్రో ప్రయోగిస్తే.. నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నది ఉపగ్రహాలు మాత్రమే కాదు. మన ఘనతా, మన సత్తా కూడా. అపార అనుభవమూ, అత్యంత చవకైన సేవలతో.. అంతరిక్ష యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ.. ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా చేస్తోందీ.. మన ఇస్రో.

Related image

ఏ రంగంలో అయినా.. ఎప్పుడు వచ్చాం అన్నది కాదు.. ఎంత సాధించాం.. ఎన్ని రికార్డులు సృష్టించాం అనేదే ముఖ్యం. ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది మన దేశం. ప్రధాన దేశాలతో పోలిస్తే అంతరిక్ష రంగంలోకి ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు.. కానీ.. వనరులు సరిగ్గా లేక సైకిల్ మీద రాకెట్లను మోసుకు వెళ్లి ప్రయోగాలు చేసే స్థితి నుంచి ఈనాడు మన ఇస్రో సాధిస్తున్న విజయాలు.. రికార్డులు అసామాన్యం.  1969 లో ప్రారంభమైన ఇస్రో చరిత్రలో మరపురాని ఘట్టాలెన్నో. 2008లో చంద్రయాన్ ప్రయోగంతో భారత కీర్తిని చంద్రునిపైకి తీసుకు వెళ్లింది.

Image result for ISRO mean

2014లో మంగళ్‌యాన్ ప్రయోగం ద్వారా.. అంగారక గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా చేరుకున్న ఏకైక అంతరిక్ష సంస్థగా ఇస్రో చరిత్ర సృష్టించింది. 2016లో పునర్వినియోగ లాంచ్ వాహనపు తొలి పరీక్ష విజయవంతంగా పూర్తి చేయడమే కాక.. అదే ఏడాది.. ఒకే రాకెట్టుతో 20 ఉపగ్రహాలను ప్రయోగించి మన సత్తా చాటింది. ఇక 2017లో అయితే.. ఒకే రాకెట్టుతో 104 ఉపగ్రహాలను ప్రయోగించి మరే దేశానికీ సాధ్యం కాని తిరుగు లేని రికార్డు సృష్టించిన మహత్తర ఘట్టం అవిష్కృతమైంది. అదే ఏడాది జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ప్రయోగమూ విజయవంతం అయింది.

Image result for ISRO mean

అదే విజయ పరంపరలో ఇప్పుడు ఇస్రో సెంచరీ కొట్టింది. వాళ్లవీ వీళ్లవీ కాదు.. కేవలం మన దేశానికి చెందిన వందో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి భారత మువ్వన్నెల జెండాను విశ్వ వినువీధులలో రెపరెపలాడేలా చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి వందో ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించి విజ‌య‌వంతంగా క‌క్ష్యలోకి ప్రవేశ‌పెట్టింది. శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటల 29 నిముషాలకు PSLV – C 40 రాకెట్.. 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్ర‌వేశ‌ పెట్టింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక మైక్రో ఉపగ్రహం ఉన్నాయి. భార‌త్ త‌న వందో ఉప‌గ్రహాన్ని ప్ర‌వేశ‌పెట్టడంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నించాయి.


ఇప్పటి వరకు ‘కార్టోశాట్‌’ సిరీస్‌లో ఆరు ఉపగ్రహాలను ప్రయోగించగా.. తాజాగా ఏడో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. 710 కేజీల బరువున్న ‘కార్టోశాట్‌’ లో అత్యాధునికమైన కెమెరాలు అమర్చారు. భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హై రిజల్యూషన్‌ ఫోటోలు అందించడం కార్టోశాట్‌-2ఇ ఉపగ్రహ ప్రత్యేకత. కార్టోశాట్‌-2 శ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం. ఇందులో పాన్‌ క్రొమాటిక్‌, మల్టీ స్పెక్ట్రల్‌ కెమెరాలు ఉంటాయి. హై రిజల్యూషన్‌ డేటా అందించడంలో వీటికి తిరుగు లేదు. పట్టణ, గ్రామీణ ప్రణాళిక.. తీర ప్రాంత వినియోగం, నియంత్రణ.. రోడ్డు నెట్‌వర్క్‌ పర్యవేక్షణ.. నీటి పంపిణీ.. భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ.. భౌగోళిక, మానవ నిర్మిత అంశాల్లో మార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

Image result for ISRO mean

అయిదేళ్లు పనిచేసే ఈ ఉపగ్రహంతో మన పొరుగుదేశాలపైనా నిత్యం నిఘా వేసి ఉంచే అవకాశం ఉంటుంది. ఈ కెమెరాలు భూమిపై ఒక మీటర్‌ పరిధిని కూడా స్పష్టంగా చిత్రీకరించి త్వరితంగా ఉండే నియంత్రణ కేంద్రాలకు పంపగలవు. ఇప్పటికే అంతరిక్షంలో సేవలందిస్తున్న ‘కార్టోశాట్‌’ తరగతికి చెందిన ఉపగ్రహాలు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని అందించాయి. మన దేశానికి మూడువైపులా సువిశాలమైన సముద్ర తీరం ఉంది. తీరప్రాంత భూముల సమర్థ వినియోగం, జలాల పంపిణీ, రహదారి నిర్వహణకు సంబంధించి సమగ్రమైన వ్యవస్థపై దృష్టి.. తదితర అంశాల్లోనూ వీటి సేవలను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిగతా 28 ఉపగ్రహాల్లో అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 3 మైక్రో, 25 నానో శాటిలైట్లు ఉన్నాయి.

Image result for ISRO mean

ఇస్రో ప్రయోగాలకు తిరుగులేని బ్రహ్మాస్త్రం PSLV. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా ఇది పేరుపొందింది. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జరిగిన 61 ప్రయోగాల్లో 41 ప్రయోగాలు PSLV వే. వాటిలో కేవలం రెండే విఫలమయ్యాయి. మిగిలినవన్నీ విజయవంతమే. ఇంత కచ్చితత్వం ఎక్కడా సాధ్యం కాదు. అందుకే PSLV ని అత్యంత విశ్వసనీయ మిత్రుడిగా ఇస్రో భావిస్తుంది. ఇస్రో రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను.. ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుండగా.. చిన్న విదేశీ ఉపగ్రహాలను PSLV ద్వారా ప్రయోగించి వాణిజ్య పరంగా ఆదాయం గడిస్తోంది.


చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి 104 ఉపగ్రహాలను మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత PSLV కే సొంతం. ఇప్పటివరకు 41.. PSLV రాకెట్‌ ల ద్వారా 210 విదేశీ ఉపగ్రహాలు, 39 స్వదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. అంతరిక్ష వేదికగా భారత కీర్తిపతాకలను ప్రపంచానికి చాటుతున్న ఇస్రో వెనుక.. పద్దెనిమిది వేల మంది కష్టం ఉంది. అందులో పదిహేను వేలమంది ఇంజినీర్లూ, శాస్త్రవేత్తలే. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. మిగతా విభాగాలు దేశమంతా విస్తరించి ఉన్నాయి. శ్రీహరికోటలో సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, తిరువనంతపురంలో విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ఉన్నాయి.

Related image

తిరువనంతపురం కేంద్రంగానే ఉపగ్రహ తయారీ కేంద్రం, ఇతర కీలక విభాగాలూ పని చేస్తున్నాయి. హసన్‌, భోపాల్‌ లో రాకెట్లను నియంత్రించే మాస్టర్‌ కంట్రోల్‌ కేంద్రం ఉంది. హైదరాబాద్‌ సమీపంలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీకి చెందిన డేటా రిసెప్షన్‌ స్టేషన్‌ అయితే.. ఓ ఉపగ్రహ గణాంక నిధి. విక్రమ్‌ సారాభాయ్‌, సతీష్‌ ధావన్‌, యు.ఆర్‌.రావు, కస్తూరిరంగన్‌ తదితర దిగ్గజాల నిర్దేశకత్వంలో ఇస్రో ఇంతింతై... అన్నట్టుగా ఎదిగింది. ఆర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది.


1962లో కేరళలోని తుంబ రాకెట్‌ ప్రయోగ కేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగు పడింది. ముందుగా వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్‌ రాకెట్లను అంతరిక్షానికి పంపింది. 1975లో రష్యా సాయంతో మన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను చేరవేసింది. అనంతరం 1979లో శ్రీహరికోట కేంద్రం నుంచి SLV రాకెట్‌ను నింగి మీదికి సంధించింది. ప్రయత్నం విఫలమైనా.. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో 1980లో SLV రాకెట్‌ రోహిణిను విజయవంతంగా గగనానికి చేర్చింది.

Image result for ISRO mean

1979-81 మధ్యలో భాస్కర ప్రయోగంతో మరో ముందడుగు పడింది. సామాన్యులకు శాస్త్ర, సాంకేతిక ఫలితాలను చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహ ప్రయోగాలనూ చేపట్టింది. 1975-76లో ‘శాటిలైట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌ పరిమెంట్‌’ ద్వారా.. సమాచార ఉపగ్రహాన్ని విద్యా బోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా నిరూపించింది. 1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహాన్ని పంపింది. 1982-90 మధ్యకాలంలో విదేశీ రాకెట్ల సాయంతో ఇన్సాట్‌-1 ను నింగికి చేరవేసింది. ఇది ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాలను అనుసంధానం చేసి వినోద, విజ్ఞానాలతోపాటు విద్యావ్యాప్తికి దోహదపడింది. ఆతర్వాత చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టింది.


ఒక రాకెట్‌ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం. PSLV – C 36 PS 4 లో రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో ద్రవ ఇంధనం నింపడం, నావిక్‌ వ్యవస్థ ద్వారా రాకెట్‌ పర్యవేక్షణ, ప్రతికూల వాతావరణంలోనూ రాకెట్‌ అనుసంధానం, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహంలోని పెలోడ్స్‌ ను మనమే అభివృద్ధి చేసుకోవడం.. ఇలా అన్నీ విజయాలే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. శాస్త్ర ప్రయోగాల్లోనే కాదు, ఆర్థిక ఫలితాల్లోనూ ముందుంది. విదేశీ ఉపగ్రహాల్ని నింగికి పంపుతూ, దేశానికి కోట్ల రూపాయల విలువైన మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది.

Related image

ఇస్రో వాణిజ్య వ్యవహారాల సంస్థ యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ వ్యాపారం నడుస్తోంది. ట్రాన్స్‌ పాండర్స్‌ ను టెలికాం సంస్థలు  వినియోగించు కోవడం ద్వారానూ రాబడి వస్తోంది. ఉపగ్రహాలే ఆలంబనగా అందుతున్న టెలివిజన్‌, DTH, DSNG, వీ శాట్‌, టెలీ విద్య, టెలీ వైద్య... తదితర సేవలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జనజీవనాన్ని మెరుగుపరిచేవే. మొత్తంగా ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేసేవే.


అయితే.. ఇన్ని ఘనతలు సాధించినా.. ఇంకా మనం అధిరోహించాల్సిన మెట్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పటిదాకా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపిన అనుభవం మనకు లేదు. కానీ ఆ లోటూ త్వరలోనే తీరనుంది. మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియా మొదలైపోయింది. ఇస్రో, భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఇది. ఈ ప్రాజెక్టుతో రష్యా, అమెరికా, చైనాల సరసన మనమూ చేరనున్నాం.


ప్రయోగించే ప్రతి ఉపగ్రహానికీ ఒక వాహక నౌకను తయారు చేసుకోవడం అంటే.. వేలకోట్ల రూపాయల వ్యవహారం. అది కూడా ఒక్కసారికే పనికొస్తుంది. అదే నౌకను వెనక్కి రప్పించుకుని, మళ్లీ మళ్లీ ఉపయోగిస్తే ఖజానాకు భారం తగ్గుతుంది. అంతరిక్ష ప్రయోగాల వ్యయమూ ఎనభై శాతం మేర పడిపోతుంది. ఆ ఆలోచనతోనే.. ఇస్రో పునర్వినియోగ వాహక నౌకను రూపొందించింది. ప్రయోగాత్మకంగా శ్రీహరికోట నుంచీ 65 కిలోమీటర్ల ఎత్తు వరకూ పంపి, మళ్లీ వెనక్కి తెప్పించింది. భారతీయుల మేథోసంపత్తికి, అకుంఠిత దీక్షకు ఇస్రో ప్రత్యక్ష ఉదాహరణ. ఇస్రో శాస్త్రవేత్తలు ఇదే పనితనాన్ని కొనసాగిస్తూ.. విశ్వ విను వీధులలో భారత కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని ఆకాంక్షిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: