భారత దేశంలో రాను రానూ..మానవత్వం పూర్తిగా నశించిపోతున్నదని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది కామాంధులు చేస్తున్న హత్యాచారాలు, హత్యల పర్వం చూస్తుంటే..సమాజంలో ఒక ఆడమనిషి బయటికి వెళ్లి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  మరీ దారుణమైన విషయం ఏంటంటే..కామంతో కళ్లు మూసుకు పోయిన కొంత మంది వృద్దులు, చిన్నారులు అని కూడా చూడకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. 

ఢిల్లీలో గత అక్టోబర్‌లో 11 నెలల పాపపై లైంగికదాడి జ‌రిగిన‌ ఘటన అప్పట్లో కలకలంరేపింది. దాని నుంచి తెరుకోక‌ముందే ఎనిమిది నెలల పసిగుడ్డుపై లైంగికదాడి చేశాడు ఓ కామాంధుడు. రక్తపుమడుగులో పడిఉన్న పాపను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దారుణం దేశరాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్చిమఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన  సంచలనంగా మారింది.  అత్యాచారానికి గురైన పాప తల్లి గృహకార్మికురాలిగా, తండ్రి అడ్డా కూలీగా పనిచేస్తున్నారు.

ఆదివారం పాప ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బావయ్యే 28 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. అతిదారుణంగా లైంగికదాడిచేసి పారిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన తల్లి.. రక్తపుమడుగులో పడిఉన్న పాపను చూసి నిర్ఘాంతపోయింది. పాప‌కు రక్తస్త్రావం ఎక్కువ కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ఆ చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని, ఎమర్జెన్సీ కేసుగా పరిగణించిన డాక్ట‌ర్లు చికిత్స అందించామని చెప్పారు.
ఇండియా అత్యాచారాల విముక్త దేశం కావాలని కోరుతూ ఏర్పాటు చేసిన ప్లకార్డు
మూడు గంటల సర్జరీ తర్వాత గానీ ఆమెకైన గాయం చల్లారలేదు. పాప పరిస్థితి కుదుటపడిందని ప్రస్తుతానికి ఐసీయూలో ఉంచామని డాక్టర్లు ప్రకటించారు. నిందితుడైన 28 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. అతడు రోజు కూలీ కార్మికుడని పేర్కొన్నారు.  నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, పోస్కో, ఇతర ఐసీపీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని చెప్పారు.
చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టాలని కోరుతూ విద్యార్థుల ధర్నా
దిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలీవాల్  ఆస్పత్రికి వెళ్లి ఆ పసిపాపను చూశారు. పాపకు అయిన గాయాలు "ఘోరమైనవి" అని ఆమె ఎంతగానో ఆవేదన చెందారు.  గుండెను మెలిపెట్టే పాప ఏడుపు ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వినిపిస్తోంది. ఆమె అంతర్గత అవయవాలకు దారుణ గాయాలయ్యాయి అని మలీవాల్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: