ఏపీ విష‌యంలో కేంద్రం చూపుతున్న వివ‌క్షపై ర‌గులుతున్న నిర‌స‌న‌లు ఎంత మేర‌కు ఫ‌లిస్తాయి?  ఎంత మేర‌కు మ‌న‌కు ల‌బ్ధి చేకూరుస్తాయి?  అనే విష‌యాల‌పై తాజాగా చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి కేంద్రం ఎప్పుడో ఏపీ విష‌యంలో స్పందించాల్సి ఉంది. ప్ర‌త్యేక హోదా స‌హా లోటు బ‌డ్జెట్ లెక్క‌లు, రాజ‌ధాని నిధులు, వెనుక‌బ‌డ్డ జిల్లాల విష‌యంలో కేంద్రం స్పందించి వెంట‌నే రాష్ట్రానికి త‌గు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, 14వ ఆర్థిక సంఘం చెప్పిందం టూ.. హోదా విష‌యంలో మాట మార్చిన కేంద్రం ప్యాకేజీని చేతిలో పెట్టింది. అది కూడా ఎన్నో కూడిక‌లు, తీసివేత‌లు వేసుకున్న త‌ర్వాత ప్యాకేజీని కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే, దానికి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త రాలేదు. అంతేకాదు, ప్యాకేజీలో పేర్కొన్న అంశాల‌పైనా స్ప‌ష్ట‌త రాలేదు. 

Related image

దీంతో స‌హ‌జంగానే ఏపీలో అసంతృప్తి మిగులుతుంది. వ‌చ్చేది ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో అధికార ప‌క్షానికి ఏపీలో ఇప్ప‌టికే జ్వ‌రం ప‌ట్టుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పైగా కేంద్రంలోని మిత్ర ప‌క్ష ప్ర‌భుత్వం నుంచే నిధులు తెచ్చుకోలేని ప‌రిస్థితిలో ఉందేంటి? అనే వ్యాఖ్య‌లు సైతం వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కేంద్రంపై ఏపీ అధికార ప‌క్షం, మిత్ర ప‌క్షం అయిన టీడీపీ పోరుకు సిద్ధ‌మైంది. పార్ల‌మెంటులో సోమవారం టీడీపీ ఎంపీలు ఇంటా బ‌య‌టా అన్న‌ట్టుగా ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం ఏపీని ఆదుకోవాల‌ని, విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని కోరారు. ఎంపీలు మూకుమ్మ‌డిగా స‌భ ప్రారంభం నుంచే ఆందోళ‌నకు దిగ‌డంతో ఏపీ క‌ష్టాల సెగ కేంద్రానికి తాకుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. 

Image result for ap special status

అయితే, ఇదే స‌మ‌యంలో అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ విష‌యంలో కేంద్రం ఏమైనా చేయాల్సివ‌స్తే.. దానికి ఉన్న మార్గాలు ఏమిటి? ఎలా చేస్తుంది? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే పూర్త‌యి, ఒక సారి పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి న్యాయం చేసే అవ‌కాశం ఉందా ? అనే సందేహం కూడా వ‌స్తోంది. అయితే, ఒక‌సారి ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో మార్పులు చేసే సాహ‌సం ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌జాలదు. ఒక వేళ అలా కాద‌ని చేస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో అసంతృప్తితో ఉన్న ప్ర‌భుత్వాలు సైతం  కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అస‌వ‌ర‌మైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధ‌మ‌వుతాయి. 

Image result for ap special status

సో.. బ‌డ్జెట్‌లో ఏపీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైతే ప్ర‌క‌టించారో అవి మాత్ర‌మే ఉంటాయి త‌ప్ప‌.. కొత్త‌గా బ‌డ్జెట్‌ను స‌వ‌రించే ప‌రిస్థితి రాదు. అయితే, ఏపీ చేస్తున్న ఆందోళ‌న ఫ‌లితంగా ప్యాకేజీ కింద ప్ర‌క‌టించిన ప్ర‌యోజ‌నాల విష‌యంలో స్పంద‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు నిపుణులు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ప్యాకేజీ ప్ర‌క‌టించిందే త‌ప్ప ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌నూ పూర్తిగా అందించ‌లేదు. దీంతో ఇప్పుడు ఏపీ అధికార పార్టీ టీడీపీ ఒత్తిడి పెంచితే.. ప్యాకేజీ విష‌యంలో క‌ద‌లిక వ‌స్తుంది. అదేవిధంగా లోటు బ‌డ్జెట్ విష‌యంలోనూ ఓ క‌ద‌లిక వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: