తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి రాజుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ఏడాదే జ‌రుగుతాయ‌ని కొంద‌రు భావిస్తున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో ధీటుగా పోటీ ఇచ్చేందుకు విప‌క్షాలు మూకుమ్మ‌డిగా సిద్ధ‌మ‌వుతున్నాయి. అదేస‌మ‌యంలో అధికార పార్టీ కూడా తిరిగి మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకునేందుకు త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఈ క్ర‌మంలోనే నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం భారీ ఎత్తున సాగుతోంది. విప‌క్షాలు ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్‌ను, ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయి. భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కేటీఆర్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే మ‌ద్ద‌తు కోల్పోతున్నాడ‌ని, అక్క‌డ ప్ర‌జ‌లు కేటీఆర్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నార‌ని విప‌క్ష నాయ‌కులు భారీ ఎత్తున విమ‌ర్శ‌లు కుమ్మ‌రిస్తున్నారు. 

Image result for telangana

అయితే, మాట‌ల మాంత్రికుడు అయిన మంత్రి కేటీఆర్ విప‌క్షాల‌కు అదే రేంజ్‌లో స‌మాధానం ఇస్తున్నారు. త‌న‌ను, తనం తండ్రిని విమ‌ర్శిస్తున్న విప‌క్షాల‌కు ఘాటుగానే స‌మాధానం చెబుతున్నారు. ఇక‌, విష‌యంలోకి వ‌స్తే.. తెలంగాణ‌లోని సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న కెకె.మ‌హేంద‌ర్‌రెడ్డిపై తొలిసారి కేవ‌లం 71 ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. అనంత‌రం, తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు రాజీనామా చేయ‌డంతో కేటీఆర్ కూడా రాజీనామా చేసి.. 2010లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అప్పుడు కూడా ఇక్కడ కేటీఆర్ హ‌వానే సాగింది.
Image result for trs
ఇక‌, రాష్ట్రం సాధించుకున్నాక 2014లో తొలిసారి జ‌రిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల్లో నూ కేటీఆర్ విజ‌య దుందుభి మోగించి హ్యాట్రిక్ కొట్టారు.
ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. గ‌త కొన్నాళ్లుగా సిరిసిల్లపై కేటీఆర్ విముఖ‌త చూపుతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ముఖ్యంగా విప‌క్షాలు కేటీఆర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నాయి. కేటీఆర్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, ప్ర‌జ‌లు తీవ్ర‌స్థాయిలో కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని పేర్కొంటున్నారు.
Related image
ముఖ్యంగా ఇసుక వివాదం చెల‌రేగిన‌ప్పుడు పోలీసులు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఈ విష‌యంలో క‌లుగ‌జేసుకోవాల్సిన కేటీఆర్ మౌనంగా ఉండి పోలీసుల‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని ఆయ‌న‌పై ప్ర‌చారం ఉంది. ఇక‌, మ‌రో విష‌యంలోనూ కేటీఆర్‌పై ప్ర‌చారం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా  కేటీఆర్‌.. ఖైర‌తాబాద్ నుంచి కానీ, సీమాధ్రులు ఎక్కువ‌గా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి నుంచి కానీ, శేరిలింగంప‌ల్లి నుంచి కానీ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం చేశారు. 
దీంతో కేటీఆర్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే అంశంపై అంద‌రిలోనూ అనేక సందేహాలు నెల‌కొన్నాయి.

అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో మౌనంగా ఉన్న కేటీఆర్‌.. తాజాగా నోరువిప్పారు. తాను సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌బోన‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. తాను ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా సిరిసిల్ల నుంచే పోటీ చేస్తాన‌ని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. టీఆర్ ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సో.. మొత్తానికి 2019లో కేటీఆర్ ఎక్క‌డి నుంచి పోటీ చేసేదీ క్లారిటీ ఇచ్చేశార‌న్న మాట‌!!



మరింత సమాచారం తెలుసుకోండి: