టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటి కరీంనగర్‌ జిల్లాలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. రాబోయే  ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు ఆ పార్టీ  సర్వ శక్తులూ ఒడ్డుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పన్నెండు స్థానాల్లో విజయం సాధించింది. కేవలం జగిత్యాలలో మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. 


టీఆర్ఎస్ గాలిలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందారు. కాగా ఇటీవల జిల్లా రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుందని తెలుస్తోంది. వారి పనితీరుపై అటు పార్టీ క్యాడర్లో, ఇటు ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. 


ఈ నేపథ్యంలో చొప్పదండి, మానకొండూరు, వేములవాడ, హుస్నాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేష్, సతీష్ కు ఈసారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరని పలువురు నేతలు అంటున్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకొంటూ క్యాడర్ కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. క్రమంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధిస్తోంది. 


ఈ ఐదు కాంగ్రెస్‌ ఖాతాలోకే..
జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి,  మానకొండూర్ నుంచి ఆరేపల్లి మోహన్,  హుస్నాబాద్ నుంచి అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డి,  పెద్దపల్లి నుంచి విజయరమణారావు, మంథని నుంచి శ్రీధర్ బాబు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోను వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: