రాజ‌కీయాల్లో కొన్ని సంఘ‌ట‌న‌లు విచిత్రంగా అనిపించినా.. న‌మ్మ‌క త‌ప్ప‌దు. మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ, బీజేపీల్లో అత్యంత సీనియ‌ర్లు అయిన‌ ఇద్ద‌రు నాయ‌కులు ఒకే ప‌రిస్థితిలో ఉన్నారు. ఒకానొక స‌మ‌యంలో పార్టీ బ‌రువు బాధ్య‌త‌లు త‌మ భుజ‌స్కందాల‌పై మోసిన నేత‌లు.. ఇప్పుడు `సైడ్` అయిపోయారు. పార్టీలోని ఇత‌ర నాయ‌కులు ప‌ట్టించుకోకపోవడం తో పాటు పార్టీ అధినేత‌ల‌తో విభేదాలు వీరిని.. పార్టీకి దూరం చేస్తున్నాయి. రెండు పార్టీల‌కు అత్యంత క్లిష్ట‌మైన స‌మ‌యంలో వీరి వ్యూహాత్మ‌క మౌనం.. అంద‌రినీ విస్మయానికి గురిచేస్తోంది. వీరిలో ఒకరు బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ కాగా, మ‌రొక‌రు కేంద్ర‌మంత్రి, ఎంపీ అశోక‌గ‌జ‌ప‌తిరాజు! ప్ర‌ధాని మోదీతో ఉన్న విభేదాల‌తో అద్వానీని ప‌క్క‌న పెట్టేయ‌గా.. ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు కూడా అశోక్‌ను సైడ్ చేశార‌నే టాక్ వినిపిస్తోంది!!


ఏపీకి నాలుగేళ్లుగా జ‌రిగిన అన్యాయంపై టీడీపీ, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేస్తూ.. పార్ల‌మెంటు స‌మావేశాల‌ను స్తంభింప‌జేస్తున్నారు. న‌మ్మించి మోస‌గించిందంటూ ప్ర‌ధానిని నిల‌దీస్తున్నారు. తొలుత ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన ప్ర‌సంగం బీజేపీ నేత‌ల్లో గుబులు పుట్టించింది. ఇక‌ ఎన్డీఏలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీ సుజ‌నాచౌద‌రి కూడా ఆర్థికమంత్రి జైట్లీతో వాగ్వాదానికి దిగారు. వారం రోజులుగా ఇంత జ‌రుగుతున్నా.. కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ అశోకగ‌జ‌ప‌తిరాజు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆయ‌న వ్యూహాత్మ‌క మౌనం వెనుక గ‌ల కార‌ణాలు మాత్రం అంతుచిక్క‌డం లేదు! ఆయ‌న కావాల‌నే ఆందోళ‌న‌లో పాల్గొన‌ట్లేదా.. లేక ఆయ‌న్ను సైడ్ చేసేయ‌డం వ‌ల్లే క‌నిపించ‌ట్లేదా అనే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 


టీడీపీలోని అత్యంత సీనియ‌ర్ నాయ‌కుల్లో అశోక్ ఒక‌రు. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో తిరుగులేని ఆధిప‌త్యం చెలాయించిన ఆయ‌న‌.. కొన్నేళ్లుగా పార్టీపై ప‌ట్టు కోల్పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సుజ‌య కృష్ణ రంగారావు టీడీపీలో చేరిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు ఎదురుగాలి వీస్తోంద‌నే ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో జిల్లా ఇన్‌చార్జిగా గంటా శ్రీ‌నివాస‌రావును నియ‌మించ‌డం.. ఆయ‌న అశోక్ ప్రాబ‌ల్యాన్ని త‌గ్గిస్తుండంతో నొచ్చుకున్నార‌ట‌. కొంత‌కాలం నుంచి టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు, అశోక్‌కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు ప‌నులు ఏఏఐకి అప్ప‌గించి త‌ర్వాత టెండ‌ర్లు ర‌ద్దు చేయ‌డం వీటికి మ‌రింత బ‌లం చేకూర్చింది.  


అంప‌శ‌య్య‌పై ప‌డిపోయిన బీజేపీకి పూర్వ వైభ‌వం తీసుకొచ్చిన నేత‌, బీజేపీ కురు వృద్ధుడు ఎల్‌కే అద్వానీకి ఇప్పుడు అదే పార్టీలో ద‌క్కుతున్న గౌర‌వం ఏపాటితో అంద‌రికీ తెలిసిందే! ర‌థ‌యాత్ర స‌మ‌యంలో ఆయ‌న వెన‌కున్న నేత, ఇప్ప‌టి ప్ర‌ధాని మోదీ.. అద్వానీని ఎలా ప‌క్కకు త‌ప్పించేశారో బ‌హిరంగ ర‌హ‌స్య‌మే! దేశ రాజకీయాల్లో అద్వానీలానే.. ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల్లో కేంద్ర‌మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా సైడ్ అయిపోయార‌నే విమ‌ర్శ‌లు వినిపి స్తున్నాయి. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నా చంద్ర‌బాబు వీరికి పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నా.. అశోక్ ఒక్క మాట మాట్లాడ‌లేదు. ఒక్కసారీ క‌నిపించ‌లేదు. అంతేగాక మోదీతో అశోక్‌కు స‌త్సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిన చంద్ర‌బాబు.. ఆయ‌న్ను దూరం పెడుతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: