పెద్ద పెద్ద కంపెనీలు నెల‌కొల్పారు. విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. బ‌డా బ‌డా కాంట్రాక్టులు ద‌క్కించుకున్నారు. వీటన్నింటికీ మించి అవినీతి ఆరోప‌ణ‌లు, ఆర్థిక నేరాభియోగాలు.. కేసులు ఎదుర్కొంటున్నారు. ఇవ‌న్నీ నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే! మ‌రోవైపు వీళ్లే ప్ర‌జ‌ల త‌ర‌ఫున, రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిందంటూ గ‌ళం విప్పుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరి జ‌ట్టు అంతా కేంద్రం చేతిలో ఉన్నప్పుడు.. వీళ్లు చెప్పిన‌ట్టు కేంద్రం ఆడుతుందా? అంటే స‌మాధానం ఎవ‌రికైనా తెలుస్తుంది క‌దా!! రాజ‌కీయాల్లో అత్యంత సీనియ‌ర్‌ని అని చెప్పే ఏపీ సీఎం చంద్ర‌బాబు, టీడీపీ ఎంపీల మాట‌ల‌ను కేంద్రం పెడ‌చెవిన పెట్ట‌డానికి కార‌ణం.. వ్యాపారాలు, కాంట్రాక్టులు, కేసులేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  

Related image

ఏపీకి జ‌రిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలంద‌రూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. వీళ్లు చేస్తున్న పోరాటానికి కేంద్రం కూడా కాస్త మెత్త‌బ‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. విభ‌జ‌న హామీలు కొంత‌వ‌ర‌కూ నెర‌వేర్చేందుకు సుముఖంగా ఉంద‌నే లీకులు వినిపిస్తున్నాయి. ఎంపీలు నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ధితో కేంద్రంపై పోరాడుతున్నారా?  సీఎం చంద్ర‌బాబు అంటే పూర్తిస్థాయిలో స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందుకు కార‌ణం వారి వ్యాపారాలేన‌ట‌. ఎంపీ, కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి.. బడా వ్యాపార‌వేత్త‌, ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. పేరుమోసిన కాంట్రాక్ట‌ర్‌, ఎంపీ కేశినేని నాని.. ట్రావెల్ సంస్థ‌కు య‌జ‌మాని, జేసీ దివాక‌ర్ రెడ్డి.. ట్రావెల్ సంస్థ‌కు య‌జ‌మాని, ఎంపీ సీఎం ర‌మేష్‌.. బ‌డా కాంట్రాక్ట‌ర్‌, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. వ్యాపార‌వేత్త‌!!  ఈ విష‌యంలో వైసీపీ ఎంపీలు త‌క్కువేం తిన‌లేదు. వారి వ్యాపారాలు వారికి ఉన్నాయి.

Image result for tdp

ఇలా ఎంపీలు ప్ర‌తి ఒక్క‌రికీ రాజ‌కీయాలే గాక ఇత‌ర వ్యాప‌కాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇదే వీరిని కేంద్రం ప‌ట్టించుకోకుండా చేస్తోంద‌ట‌. ఏపీ టీడీపీ ఎంపీలు, అధినేత చంద్ర‌బాబు చేసే ప్రతిపాదనలను, వారి డిమాండ్లను మోదీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడమేలేమిటి? మన ఎంపీలు, కేంద్ర మంత్రుల మాటకు విలువెందుకు ఇవ్వడం లేదు? అంటే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు, పెద్దపెద్ద కాంట్రాక్టులు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారాలు కూడా ఉండడంతో కేంద్రం ముందు వారు కిక్కురుమనకుండా ఉంటూ తమతమ పనులు చేయించుకుంటుంటారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై బ్యాంకులకు రుణాలు ఎగ‌వేత కేసు న‌డుస్తోంది. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, జేసీ దివాకరరెడ్డి, సీఎం రమేశ్ వంటి వారంతా వ్యాపారాల‌పైనా అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. 

Image result for tdp

ఇక టీడీపీ అధినేత‌ చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారు. అంతేకాదు.. కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమ‌య్యాయో తెలియ‌డం లేదు. అమ‌రావ‌తి స్విస్ చాలెంజ్‌, కాంట్రాక్టులు, ఇలా నిత్యం ఏద ఒక ఆరోప‌ణ వ‌స్తూనే ఉంది. అమరావతికి సంబంధించిన డీపీఆర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నది కేంద్రం చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇన్ని ఉన్నప్పుడు ప్రజల కోసం గట్టిగా కేంద్రాన్ని ఎలా నిల‌దీయ‌గ‌లుగుతారు? అనే ప్ర‌శ్న ఇప్పుడు వినిపిస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: