గత ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేనల త్రయం దెబ్బకి జగన్ కు ఓటమి తప్పలేదు. ఎవరికెన్ని  అసెంబ్లీ స్థానాలు వచ్చాయనేది పక్కనపెట్టి ఓట్లపరంగా లెక్కేసి చూస్తే ఇరు వర్గాల మధ్య కేవలం 6 లక్షల ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉండటం జగన్ కు ఊరట కలిగించిన విషయం. అయితే ఆ సంతోషం కూడా జగన్ కు ఎంతోకాలం నిలవలేదు. కారణం ఆయన పార్టీలో ఫిరాయింపులు జరగడమే. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గతంలో చేసిన తప్పులకు తావివ్వకుండా సీఎం అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.


ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్రలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్ తనకు బీజేపీతో పొత్తుపెట్టుకోవడానికి తనకు ఇష్టమేనని తన మనసులోని మాటను కూడా బయటపెట్టాడు. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తీవ్రత పెరిగిపోతూ ఉండటం వల్ల వాళ్లు తమ పొత్తును ఉపసంహరించుకుంటారు అనే వార్తలు కూడా బీజేపీ-వైసీపీ పొత్తుకు ఊతం  కలిగించాయి.


కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే జగన్ బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే దాఖలాలు కనిపించేలా లేవు. కారణం మోడీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రభావం. విభజన చట్టంలో చెప్పినట్లుగా ప్రత్యేకహోదా ఇవ్వలేదు సరిగదా బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసారని ఇప్పటికే తెలుగు ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో తో పొత్తుపెట్టుకొనే పార్టీకి వచ్చే సీట్లు కూడా రావు. బీజేపీ తో మైత్రి కొనసాగించి అధికారంలోకి రావాలన్న జగన్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. దీనికి సంబంధించి చర్చించడానికే జగన్ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించాడన్న వార్తలూ వస్తున్నాయి. మరి ఎన్నికలు వచ్చే వరకు ఎవరు కలిసుంటారో , విడిపోతారో తెలుసుకోవాలంటే వేచిచూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: