బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ గొంతెత్తి చాటుతున్న వేళ.. బీజేపీ మినహా మిగిలిన పార్టీలు ఆందోళనలు ఉధృతం చేస్తున్న వేళ.. బీజేపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే ఆరోపణల నేపథ్యంలో మోదీ నష్టనివారణ చర్యలు చేపట్టారు.

Image result for MODI IN ANDHRA

          బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై అధికార తెలుగుదేశం పార్టీ మొదట గళమెత్తింది. జైట్లీ బడ్జట్ ప్రసంగం పూర్తవగానే ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఇక రాష్ట్రంలో కూడా ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు ఎగిశాయి. నాలుగు బడ్జట్లు పూర్తయినా కూడా విభజనచట్టంలోని అంశాలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందంటూ ఏపీ మొత్తం ధ్వజమెత్తింది. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని అభ్యర్థి హోదాలో నాడు మోదీ ఇచ్చిన మాట కూడా బుట్టదాఖలు చేశారని సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలే మండిపడుతున్నారు.

Image result for MODI IN ANDHRA

          మరోవైపు ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రానికి వ్యతిరేకంగా జట్టు కట్టాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలో JFCని ఏర్పాటు చేసి కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. తొలి సమావేశం నిర్వహించి కార్యాచరణను వ్యూహాత్మకంగా సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ కేంద్రానిదే తప్పనే ధోరణితో ఉన్నాయి. వైసీపీ మాత్రమే బీజేపీని కాకుండా టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు రెండు సార్లు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఏపీకి చేసిన మేలును ఏకరువు పెట్టారు. అయితే ఇవేవీ ఏపీని సంతృప్తి పరచలేకపోయాయి.

Image result for PAWAN JFC

          రాష్ట్రానికి అడగకపోయినా ఎంతే చేశామని బీజేపీ చెప్పుకుంటోంది. విభజనచట్టంలో పేర్కొన్న 5 అంశాలు మాత్రమే సెట్ చేయాల్సి ఉందంటోంది. అయితే ... ఆ అంశాలే అత్యంత ప్రధానమైనవనేది టీడీపీ వాదన. విభజనచట్టంలోని అంశాలతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ఎన్నో అంశాలను కూడా ఇంతవరకూ పట్టించుకోవడంలేదని టీడీపీ చెప్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం.

Image result for MODI IN ANDHRA

          అందుకే.. నేరుగా ప్రధానే రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని ప్రారంభించగల లేదా శంకుస్థాపన చేయగల ప్రాజెక్టులు ఏవైనా ఉంటే సమాచారం ఇవ్వాలని ప్రధాని కార్యాలయం ఏపీ సర్కార్ కు కబురు పంపింది. ప్రధాని ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలనుకుంటున్నారని తెలిపింది. అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్న రాష్ట్రంలో ప్రధాని గతంలోలాగా మట్టి-నీళ్లతో వస్తే మరింత వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే ఈ పర్యటనలో కచ్చితంగా ఆంధ్రా ఆగ్రహాన్ని చల్లార్చేలా ప్రధాని కొన్ని వరాలు కురిపిస్తారని బీజేపీ నేతలు చెప్తున్నమాట. ప్రధాని పర్యటన కూడా గతంలో హామీలిచ్చిన తిరుపతిలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతున్నారు. అందుకే మోదీ వ్యూహాత్మకంగా అదే వెంకన్న సమక్షంలో తప్పు దిద్దుకునే ఉద్దేశంలో ఉన్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: