ఉద్య‌మ స‌మ‌యం నుంచి త‌న వెంటే న‌డుస్తూ.. అడుగులో అడుగేస్తూ.. తాను గీసిన గిరి దాట‌కుండా త‌న‌నే నమ్ముకున్న బంటుని తెలంగాణ సీఎం కేసీఆర్ అంద‌ల మెక్కించ‌బోతున్నారు. ఎవ‌రు ఎన్ని లాబీయింగ్‌లు చేస్తున్నా .. ఎంత‌గా ఒత్తిడి పెంచుతున్నా.. వాటన్నింటినీ బేఖాత‌రు చేస్తూ ఆయ‌న‌కే `పెద్ద‌` ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌బోతున్నారు. త్వ‌ర‌లో ఖాళీ అవుతున్న మూడు రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక‌టి త‌న `షాడో`కి ఇవ్వ‌డానికి కేసీఆర్ సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది! ఇప్ప‌టికే మూడింటిలో ఒక‌టి యాద‌వుల‌కు ఇస్తాన‌ని మాటిచ్చిన ఆయ‌న‌.. తాజాగా రెండో సీటు కోసం అభ్య‌ర్థిని కూడా ఎంపిక చేసేశార‌ని గులాబీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప‌లువురి పేర్లు ప్ర‌ముఖంగా వినిపించినా చివ‌ర‌కు న‌మ్మిన‌బంటు పేరునే కేసీఆర్ తెర‌పైకి తెస్తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు.
Image result for telangana
తెలంగాణాలో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. నేత‌లంద‌రూ వ‌రుస లాబీయింగ్‌ల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే కొంద‌రు నేరుగానే గులాబీ బాస్‌ కేసీఆర్‌కు అభ్య‌ర్థ‌నలు, విన్న‌పాలు వంటి వ‌న్నీ చేసుకోగా మ‌రికొంద‌రు త‌మ‌కు స‌న్నిహితులైన వారితో రిక‌మెండేషన్లు చేయించుకుంటున్నారు. వీరిలో ఎవ‌రికి పెద్ద‌ల స‌భ‌లో కూర్చునే అదృష్టం ద‌క్కుతుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌ను న్నాయి.  తెలంగాణ నుంచి ముగ్గురి ప‌ద‌వీకాలం ముగుస్తోంది. ఈ మూడు సీట్లు టీఆర్ఎస్‌కు ద‌క్కబోతున్నాయి. దీంతో పోటీ విప‌రీతంగా పెరిగింది. ఈ మూడు స్థానాల్లో ఎవ‌రిని పంపాల‌నే దానిపై గులాబీ తోట‌లో చ‌ర్చ జ‌రుగుతుంది.

Related image

రాజ్య‌స‌భ‌కు ఎవ‌ర్ని పంపాల‌న్న దానిపై కేసీఆర్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మూడింటిలో ఒక సీటు యాద‌వ సామాజిక వ‌ర్గానికి ద‌క్క‌నుంది. దీంతో యాద‌వ‌నేత‌లు లాబీయింగ్ మొద‌లు పెట్టారు. ఆ సామాజిక‌వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు నోముల న‌ర్సింహ‌య్య‌, జైపాల్ యాద‌వ్ తో పాటు రాజయ్య యాద‌వ్ పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. వీరిలో నోముల న‌ర్సింహ‌య్య‌కే రాజ్య‌స‌భ సీటు ద‌క్కే చాన్స్ ఎక్కువ‌గా ఉందంటున్నారు టీఆర్ఎస్ ప్ర‌ముఖులు.  మిగిలిన రెండింటిలో ఒక‌టి రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి ఇస్తార‌ని తెలుస్తోంది. మ‌రో స్థానం కేసీఆర్ షాడోగా ముద్ర‌ప‌డ్డ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ కు కేటాయిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.


టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మొద‌లుకుంటే, నేటికీ కేసీఆర్ నీడ‌లా అన్ని ప‌నులు చ‌క్క‌దిద్దుకుంటూ తెర‌వెన‌క చ‌క్రం తిప్పుతున్నారు జోగిన‌ప‌ల్లి. ఆయ‌న్ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని భావించిన కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సంతోష్ కుమార్ ను ప్ర‌క‌టించారు. పార్టీ ప‌ద‌వితో పాటు మ‌రో కీల‌క‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని ఎప్ప‌టినుంచో చూస్తున్నారు. న‌మ్మిన‌బంటుకి స‌ముచిత స్థానం క‌ట్ట‌బెట్టేందుకు ఇదే సరైన స‌మ‌య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారట‌. ప్ర‌స్తుతం మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యే అవ‌కాశం ఉన్నందున ఇదే మంచి స‌మ‌యంగా భావించి జోగున‌ప‌ల్లిని రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని భావిస్తున్నార‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: