ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్లో అన్యాయం జరిగిందని టీడీపీ కొన్నిరోజులుగా బీజేపీపై మండిపడుతోంది. మిత్రపక్షంతోనూ కయ్యానికి దిగుతోంది. ఏకంగా పార్లమెంటులోనే టీడీపీ ఎంపీ ప్రధాని మంత్రినీ, ఆర్థిక మంత్రినీ కడిగిపారేశాడు.. ఇదంతా తమ నేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సూత్రధారి చంద్రబాబు మాత్రం నిన్నటివరకూ నేరుగా కేంద్రంపై విమర్శలు చేయలేదు. 


కానీ మొట్టమొదటిసారి శనివారం చంద్రబాబు నోరు విప్పారు. వ్యూహాత్మక మౌనాన్ని వదలి కేంద్రంపై విమర్శలకు దిగారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో నిర్మించనున్న జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రసంగించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ఐదు కోట్ల మంది ఆంధ్రుల తరఫున అడుగుతున్నానన్నారు. 


హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించటంతో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చంద్రబాబు అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనన్నారు. విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని..  ఇప్పటికే పార్లమెంట్‌లో గట్టిగా పోరాటం చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హక్కుల సాధన విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదన్నారు. 


ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు ప్రధాని పేరెత్తకుండానే విమర్శించారు. ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని మోడీని నేరుగా ప్రశ్నించలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదిహేడు రోజుల తర్వాత తొలిసారి కేంద్ర బడ్జెట్ లో ఎపికి అన్యాయం జరిగిందని చెప్పడానికి మౌనం వీడారని... అయినా ప్రధాని మోడీ పేరు ఎత్తడానికి భయపడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని మండిపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: