టీడీపీ-బీజేపీ మధ్య గ్యాప్ మరింత పెరగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇరువురు భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదని.. టీడీపీ అంటుంటే.. టీడీపీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ యత్నిస్తోంది. మిత్రపక్షంగా ఉండి కూడా టీడీపీ ఎంపీలు కేంద్రప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు టీడీపీని విమర్శించేందుకు రాయలసీమ నినాదం ఎత్తుకున్నారు.

Image result for kurnool declaration

రాయలసీమ ప్రాంతం వెనుకబాటుకు గురైందని.. ఇప్పటికైనా రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం పూనుకోవాలంటూ బీజేపీ రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం ఆ ప్రాంత బీజేపీ నాయకులు కర్నూలులో అత్యవసర సమావేశం నిర్వహించి.. సీమ అభివృద్ధిపై డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని టీడీపీ మిత్రపక్షం పైనే నిరసనగళం వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు సైతం టీడీపీని అదే రీతిలో ఇరుకున పెట్టేందుకు రాయలసీమ నినాదాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని వికేంద్రీకరించాలని.. ఒక చోటే కాకుండా.. రాయలసీమలో కూడా రెండో రాజధానిని నిర్మించాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. రాయలసీమ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. ఇప్పటికైనా సీమ డెవలప్ మెంట్ కి కృషి చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Image result for kurnool declaration

దీనిలో భాగంగా కర్నూలు డిక్లరేషన్‌-2018 పేరుతో 16 అంశాలపై తీర్మానాలు చేస్తూ బీజేపీ ఒక డిక్లరేషన్ ను ప్రకటించింది. రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు జిల్లాలను ఎనిమిదికి పెంచాలని ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటుగా 10వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీజేపీ సీమ నేతలు.. రాయలసీమలో కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర‍్వహించాలని, వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు 20వేల కోట్లు రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 కల్లా గాలేరు-నగరి, హంద్రీనీవా, గురు రాఘవేంద్రస్వామి ప్రాజెక్ట్‌ లు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక అధికారమంతా ఒకేచోట ఉండకూడదని, వికేంద్రీకరణ తక్షణమే జరగాలని.. సీమలో హైకోర్టు సాధన కోసం 28న కడపలో ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు కమలం నేతలు..

Image result for rayalaseema declaration

టీడీపీ తమ పార్టీపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని బీజేపీ రాయలసీమ నినాదాన్ని ఎత్తుకుంది. ఒక వేళ రాయలసీమపై ప్రత్యేక శ్రద్ధే ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి.. రాయలసీమకు బుందేల్ కండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాచ్చని.. ఇలా విమర్శలకు దిగటం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక.. బీజేపీ రాయలసీమ నేతల సమావేశానికి రాష్ట్ర ప్రతినిధులెవరూ హాజరు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నాడు కాకినాడ డిక్లరేషన్ కు బీజేపీ నేతలందరూ హాజరయ్యారు. మరిప్పుడు కర్నూలు డిక్లరేషన్ కు అందరూ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారి మధ్య సీమ అంశాలపై విభేదాలున్నాయా.. లేక సీమ నేతలు వేరు కుంపటి పెట్టుకుని దీన్ని నడిపించారా .. అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: