రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఇక దేశవిదేశీ ప్రతినిధులు కళ్లముందు కనిపిస్తే చాలు ఆయన ఏకంగా సీఈవో అవతారమెత్తుతారు. ఓ కార్పొరేట్ కంపెనీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో.. అలా ప్రజెంట్ చేస్తారు. ప్రజెంటేషన్ చూసిన ఎవరికైనా ఆయన చీఫ్ మినిస్టరా..? సీఈవోనా..? అనే సందేహం రావడం ఖాయం.

Image result for chandrababu at cii

సీఎం చంద్రబాబు CEO అవతారమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అపార వ్యాపార అవకాశాలపై కార్పొరేట్ స్టైల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలపడానికి తనకున్న విజన్ ఏమిటో ఆవిష్కరించారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ప్లీనరీ సదస్సులో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరుల గురించి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించినవారు తమ అనుభవాలను సభికులతో పంచుకున్నారు.


నవ్యాంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అవకాశాలున్నాయని చంద్రబాబు వివరించారు. ఎవరినైనా విచారించుకున్న తర్వాతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. 2050 కల్లా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి నమూనాగా మారుస్తామని తెలిపారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను, ఉన్న వనరుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వివరించారు. రంగాల వారీగా ఉన్న అవకాశాలను గణాంకాలతో సహా వెల్లడించారు.


రాజధాని అమరావతి పీపుల్స్ హబ్ గా మారుస్తున్నామని చంద్రబాబు అన్నారు. రియల్ టైమ్ గవర్నెస్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, ఈ ప్రగతి ప్రాజెక్ట్ వంటి సాంకేతిక సాధనాలతో పారదర్శకంగా పరిపాలన నిర్వహిస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపనకు ఆన్ లైన్ లో త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. బయో మెట్రిక్ వ్యవస్థ సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 2029 దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్ర స్థానంలో నిలపాలనే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు.


గూగుల్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఈ ఏడాది చివరి నాటికి వైఫై సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు.  గూగుల్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబంధించి గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం MOU చేసుకుందని సీఎం తెలిపారు. కుగ్రామాలతో సహా రాష్ట్రంలోని 13 వేల పంచాయతీలకు వైఫై సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. వైఫై ద్వారా రాష్ట్రంలోని మారుమూల గిరిజన గ్రామంలోని పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాజెక్టును ఏపీ CEO చంద్రబాబు పారిశ్రామిక వేత్తల కళ్లకు కట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా లాభాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా వృద్ధి చెందుతుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: