ఆర్టీసీ అప్పులు, వడ్డీల భారంతో సతమతమవుతోంది. ప్రతిష్టాత్మక ఆర్టీసీ ప్రగతి అప్పుల ఊబిలో కూరుకుపోతూ సంస్థ మనుగడను ప్రశ్నార్దం చేస్తోంది. నిత్యం 23 వేల బస్సులతో కోటి 40 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆసియాలోనే పెద్దదిగా పేరుగాంచిన ఆర్టీసీకి ఏటా అప్పుల ఊబి తప్పడంలేదు. లక్షా 30 వేలమంది సిబ్బందితో నిత్యం బిజీగా ఉండే ఆర్టీసీని ఒకవైపు నష్టాల, ,మరో వైపు అప్పులు కుంగదీస్తున్నాయి. ఏయేటికాయేడు నష్టాల బాటపడుతున్న ఆర్టీసీకి డీజిల్ కొనుగోలు, జీతాలు, అప్పులపై వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోలు, సంస్థ ఆధునీకరణ ప్రణాళికలు అటకెక్కాయి. కాగా ఇప్పటికే రూ 4500 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థకు తాజా మరో రూ…500 కోట్లు అప్పులు అవరసమయ్యాయి. అయితే ఇప్పటికే ఉన్న రూ.4500 కోట్ల అప్పుకు ఏటా రూ.271.84 కోట్లు కేవలం వడ్డీకే చెల్లిస్తోంది. అదేవిధంగా డొక్కు బస్సులు సంస్థకు గుదిబండగా మారి భారీ నష్టాలకు కారణమవుతున్నాయి. ప్రతిష్టాత్మక ఆర్టీసీలో 20 వేల సొంత బస్సుల్లో 8 వేల డొక్కు బస్సులు ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఆర్టీసీలో ప్రతి లక్ష కి.మీ. తిరిగిన బస్సును మూలనపడేయాలి. వాటి స్థానంలో కొత్త బస్సు కొనుగోలు చేయాలి. కానీ ఆర్టీసీలో 15 లక్షలకు పైగా తిరిగిన బస్సులు 5 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇలాంటి బస్సులతో అధిక డీజిల్ వినియోగం, రిపేర్లు తడిసి నష్టాలు పెరుగుతున్నాయి. ఈ డొక్కు బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు నిరాకరిస్తుండటంతో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియని ఈ బస్సులతో నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతోంది. కాగా ఆర్టీసీ ఖర్చులు ఇలా ఉన్నాయి. సిబ్బంది వేతనాలకు రూ.2473.70 కోట్లు, వర్కుషాపుల నిర్వహణకు రూ.120.77 కోట్లు, ఇంధనం కొనుగోలుకు రూ.2018.56 కొట్లు, టైర్లు, ట్యూబుల ఖర్చు రూ.147.14 కొట్లు, వాహన పన్ను రూ.365.72 కోట్లు, అప్పులపై వడ్డీ చెల్లించేందుకు రూ.271.84 కోట్లను ఖర్చు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: