కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఎన్డీఏలో తొలి నుంచి కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు... కేంద్రంలో భాగస్వామిగా చేరారు. అయితే విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందంటూ కీలక ప్రకటన చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు టీడీపీ వైదొలగడానికి దారి తీసిన పరిణామాలేంటి. 

Image result for TDP BJP

రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్ర ప్రదేశ్ ను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని అప్పటి బీజేపీ నేతలు స్పష్టమైన హామీలు ఇచ్చారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోదీ... తిరుపతి లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రానికి ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు నిర్మాణానికి అవసరమైన నిధులను తక్షణమే కేటాయిస్తామన్నారు. అలాగే 11 విద్యాసంస్థల నిర్మాణ బాధ్యత కూడ కేంద్రానిదే అంటూ హామీలు గుప్పించారు..

Image result for TDP BJP

అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి వేదికగా ఇచ్చిన హామీల అమలును ప్రధాని మోదీ మరిచినట్లున్నారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 33 వేల ఎకరాలను సేకరించి ఇస్తే.... నిర్మాణానికి అవసరమైన  నిధుల కేటాయింపులో మాత్రం కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు కోసం ఏకంగా 17 వేల కోట్లను కేటాయించిన మోదీ సర్కారు.... రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేవలం 2 వేల 500 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో వెయ్యి కోట్లను విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజ్ కోసం కేటాయించినవే. అంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం కేటాయించింది కేవలం 15 వందల కోట్లు మాత్రమే. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు పెట్టిన మోదీ ప్రభుత్వం.... చివరికి 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన డబ్బు కోసం కేంద్రంతో నిత్యం పోరాడాల్సి వస్తోంది..

Image result for TDP BJP

ఇక విభజన హామీల్లో ప్రధానమైనది రాష్ట్రానికి ప్రత్యేక హోదా. అన్ని రకాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక హోదా ద్వారా ఆదుకోవాల్సిన అవసరముందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉండాలని మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే... అప్పటి రాజ్యసభలో బీజేపీ విపక్ష నేత వెంకయ్య నాయుడు పదేళ్లు కావాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఇదంతా గతం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాకు సహకరిస్తామన్న మోదీ.... ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. నీతి ఆయోగ్ వచ్చిందంటూ కొత్తపల్లవి అందుకున్నారు. 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం అనుమతి లేదంటూ హోదా విషయాన్ని పక్కన పెట్టారు. హోదాకు బదులుగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. హోదా వల్ల కలిగే అన్ని లాభాలను కూడా ప్యాకేజ్ ద్వారా అందిస్తామని చంద్రబాబుకు సూచించారు. అందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజ్ కు అంగీకరించారు.

Image result for TDP BJP

హోదాకు బదులుగా ఇస్తానన్న ప్యాకేజీ విషయంలో కూడా రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించింది. చివరికి నాబార్డు ద్వారా రుణం ఇప్పించాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని కూడా కేంద్రం తోసి పుచ్చింది. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వటం లేదంటూ చెబుతున్న కేంద్రం రాష్ట్రానికి మాత్రం బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామన్నారు. కానీ చివరికి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాతో పాటు బుందేల్ ఖండ్ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అనేక రాయితీలను కూడా ప్రకటించింది.

Image result for TDP BJP

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు అక్కడ మొండి చెయ్యి లభించిందనే చెప్పాలి. విభజన చట్టంలో ప్రధానమైన హామీల్లో ఒకటైన ప్రత్యేక రైల్వే జోన్ అంశం కూడా అమలు కాలేదు. లాభదాయకం కాదనే కుంటి సాకుతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును కేంద్రం పక్కన పెట్టింది. కడప ఉక్కు పరిశ్రమ, రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థల నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపులో కూడా మొండి వైఖరి చూపింది. హోదాతో పాటు ఇతర అన్ని అంశాలను కూడా కేంద్రం పక్కన పెట్టింది. చివరికి విజయవాడ, విశాఖ నగరాల్లో  మెట్రో రైలు నిర్మాణానికి మోకాలు అడ్డుపెట్టింది. ప్రతి విషయానికి లాభదాయకం కాదనే సాకుతో కనీస నిధులు కూడా కేటాయించకుండా అడ్డుకుందనే చెప్పాలి. అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే, రాజధాని, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ సహా కీలకమైన విభజన హామీలకు కూడా మోదీ సర్కారు రాష్ట్రానికి మొండి చెయ్యి చూపారు. ఎన్నికలున్నాయనే సాకుతో బెంగళూరు మెట్రోకు ఏకంగా 17 వేల కోట్లు కేటాయించిన జైట్లీ... రాష్ట్రానికి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

Image result for TDP BJP

రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం నిరసనలు వెల్లువెత్తిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కనీస గౌరవం ఇవ్వకుండా కేంద్రం అవమానించిందనే చెప్పాలి. బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో భారీగా నిధులు కేటాయించమంటూ బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉపోద్ఘాతాలు ఇచ్చారు.  ఈ పరిస్థితుల్లో కేంద్రంతో కలిసి ప్రయాణం చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు భావించారు. విడిపోయి విభజన హామీలపై పోరాటం చేసి సాధించుకోవాలని చంద్రబాబు భావించారు. కేంద్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి దేశ రాజకీయాల్లో సంచలనం రేపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: