మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓ భావోద్వోగ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎప్పుడూ సీరియస్ గా ఉండే సీఎం చంద్రబాబు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఉన్నట్టుండి కంటనీరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న అన్యాయం తలచుకుని ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అమరావతికి సాయం చేయమంటే కేంద్రం చూపిన లెక్కలు గుర్తొచ్చి ఆయన గొంతు వణికింది. 


అసెంబ్లీలో కేంద్రం తీరుపై ప్రసంగిస్తున్న సమయంలో చంద్రబాబు గొంతు ఒక్కసారిగా జీరపోయింది. గద్గద స్వరంతో చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. ‘‘రాజధానికి రైతులు రూ.40 వేల కోట్ల విలువైన భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చారు. బాధ్యతగల ప్రభుత్వాలుగా మనమేం ఇచ్చాం? అదే నేను అడుగుతున్నాను. అక్కడే నాకు బాధేస్తోంది.. అంటూ కేంద్రం తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. 


" రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. దానిలో గుంటూరు, విజయవాడ నగరాలకు చెరో రూ.500 కోట్లు ఇచ్చారు. రాజధానికి కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి అంతా ఇచ్చేశామన్నట్టు మాట్లాడుతున్నారు’’ అని చంద్రబాబు అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని నిలదీశారు.
ఎవరెన్ని అవమానాలు చేసినా.. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామన్నారు. 


అమరావతి నిర్మాణాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడాలేని విధంగా దాదాపు 40 వేల ఎకరాలను రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా సేకరించారు. అమరావతిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలని ఎన్నో దేశాలు తిరిగి నమూనాలు పరిశీలించారు. కానీ కేంద్రం ఆయన ఆశించినంత సాయం చేయకపోవడం చంద్రబాబును కలచివేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: