రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. కేంద్రంపై పోరాటం చేయడంలో తామే ముందున్నాం అని చెప్పుకోవడానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడతాయన్న ప్రచారంతో ముందుగానే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి వైసీపీ ముందడుగు వేస్తే.. మీపై మాకు నమ్మకం లేదు.. అవిశ్వసం పెట్టాలన్నా.. దానికి మద్దతు కూడగట్టాలన్నా మా వల్లే అవుతుందంటూ.. బీజేపీ, వైసీపీలకు ఒకేసారి టీడీపీ ఝలక్ ఇచ్చింది. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు తెలుగుదేశం ఇలా ప్రకటించగానే.. దేశవ్యాప్తంగా పార్టీలన్నీ స్పందించాయి. తద్వారా జాతీయ స్థాయిలో తన సత్తా ఏమిటో చంద్రబాబు మరోసారి చాటిచెప్పినట్లయింది. అదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందంటూ ప్రకటించి ఏపీలో బలమైన పక్షంగా ఎదిగేలా పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తున్నారు.

Image result for babu pavan jagan

విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ మంత్రుల్ని వెనక్కి తీసుకున్న టీడీపీ తాజాగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చి అవిశ్వాసం పెట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలుగుతున్నట్లు తెలుగుదేశం స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దిల్లీలో అత్యవసర సమావేశానికి ఏపీ బీజేపీ నేతలకు పిలుపు అందింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పుంజుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పార్టీతో కలిసి నడిస్తే ప్రయోజనం ఉంటుందనే అంశాలు చర్చించాలనే అంశాలపై తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. వైసీపీతో కలిసి నడుస్తారా.. లేక జనసేనను కలుపుకుంటారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. టీడీపీ పొత్తుకు కటీఫ్ చెప్పిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు టీడీపీపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై విమర్శలకు దిగుతోందని, అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తోందని బీజేపీ నాయకులంటున్నారు. తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ కేంద్రం ఏమీ చేయలేదనడం  చంద్రబాబు  అసమర్థతను  తెలియజేస్తోందని  విమర్శించారు.  వచ్చే  ఎన్నికల్లో  ఓడిపోతామన్న భయంతోనే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తరచూ భావోద్వేగానికి లోనవుతుండడం.. ఆయన ఎంత రాజకీయ ఒత్తిడిలో ఉన్నారో చెబుతోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నరసింహారావు వ్యాఖ్యానించారు.

Image result for babu pavan jagan

అసెంబ్లీ వేదికగా మరోసారి చంద్రబాబు భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని అంశాలు, హామీలను అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. జనసేన అధినేత పవన్‌పైనా సీఎం మరోసారి ఫైర్ అయ్యారు. నియోజకవర్గానికి 25 కోట్లు పంపుతున్నారంటూ పవన్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. అసలు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని కోరినది తానే అన్న చంద్రబాబు.. డిజిటల్ కరెన్సీ తెస్తే అవినీతి ఉండదని, ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరగదని చెప్పింది కూడా తనే అని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తారని విమర్శించారు. నాలుగేళ్లుగా మంచివాడిగా కన్పించిన తాను రాత్రికి రాత్రే ఎలా చెడ్డవాడినయ్యానని ప్రశ్నించారు.

Image result for babu pavan jagan

ఇసుక విక్రయాలకు సంబంధించి ఎక్కడో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే... మైనింగ్‌ స్కామంటూ గాలి జనార్దన్‌రెడ్డితో పవన్ ముడిపెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపామని, అందుకు నిరసన వ్యక్తం చేస్తూ దివంగత మాజీ సీఎం జయలలిత లేఖ పంపారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎర్రచందనం వేలంలో 1,230 కోట్లు ఆదాయం వచ్చిందని, ఎర్రచందనం వేలానికి కేంద్రం నుంచి అనుమతులు రావాలని చెప్పారు. స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చట్టం తీసుకొచ్చామని, విమర్శించే ముందు పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని జనసేన అధినేతను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏసీబీ కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు.

Image result for babu pavan jagan

ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటికొచ్చినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. తెలుగుదేశం నిర్ణయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విషయంలోనూ రాజీ పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఏపీ కష్టాలను కేంద్రం పట్టించుకోలేదని, నాలుగు బడ్జెట్‌లలోనూ ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్‌ కష్టాలను కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు నెరవేరుస్తామని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన బీజేపీ.. అధికారంలోకి రాగానే మరిచిపోయిందన్నారు. సెంటిమెంట్‌తో నిధులు రావని జైట్లీ ఎలా చెబుతారుని.. తెలంగాణ రాష్ట్రాన్ని సెంటిమెంట్‌ ద్వారానే ఇచ్చిన సంగతి ఆయనకు తెలీదా? అని ప్రశ్నించారు.

Image result for babu pavan jagan

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని సూచించిందని గతంలో చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అలా ఏమీ చెప్పలేదని రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటించారనీ.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పరంగా అట్టడుగున ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు ఇచ్చారు. అలాంటి పరిశ్రమలు మనకూ కావాలని అడుతున్నాం. ఎన్నికలకు ముందు మోదీ ఏపీ పట్ల ఎంతో సానుభూతి చూపించారనీ.. దిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామన్నారు.. ఆ హామీలన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు.

Image result for babu pavan jagan

రైల్వేజోన్ విషయంలో కేంద్రం దాటవేత ధోరణి అవలంభిస్తోందన్న సీఎం.. ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలోనే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాలకు రైల్వేజోన్‌ ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అది పూర్తయితే రాష్ట్రంలో కరువు ఉండదు. ఆ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని.. పోలవరంలో అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Image result for babu pavan jagan

మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఏపీ ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశారు. 4ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న రాజీ లేని పోరాటంతో తెలుగుదేశం పార్టీతో సహా జాతి మొత్తం మేల్కొందని జగన్ ట్వీట్ చేశారు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ మరోసారి వైఎస్సార్‌సీపీ బాటలో నడిచి... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిందని జగన్ ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం, ఏపీ ప్రజలు సాధించిన విజయంగా జగన్ అభివర్ణించారు. వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఏపీ ప్రజల హక్కుల సాధనకై కృషి చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.

Image result for babu pavan jagan

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, వైసీపీ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అవిశ్వాసం పెట్టే అంశంలో రెండు పార్టీలు తేదీలను ముందుకు, వెనక్కి జరుపుతున్నాయన్నారు.  అవిశ్వాస తీర్మానంపై టీడీపీ, వైసీపీ ఒక్కటయ్యాయని అంటున్నారని.. అక్కడే వారి కుమ్మక్కు అర్థమవుతోందని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇలా ఏపీ రాజకీయం క్షణక్షణానికీ మారిపోతోంది. ప్రతి పార్టీ కూడా ప్రత్యర్ధుల పై పైచేయి సాధించడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!!


మరింత సమాచారం తెలుసుకోండి: